Wednesday 28 May 2008

ఒక జ్ఞాపకం.........

హైదరాబాద్ - 09-06-2003 - 06.30 సాయంత్రం
డైరీనుంచి యథాతథంగా..

త్యాగరాజు అన్నది నాన్నగారి పేరైతే నేనెందుకు త్యాగాలు చేయాలో 1990 నుంచీ కూడా నాకు అర్థం కాని ప్రశ్న. అది అలాగే కొనసాగుతోంది. ఈరోజు నాకు చాలా ఇష్టమైన జర్నలిజం (ఈనాడు) కోర్సులో జాయినింగ్ రిపోర్టు ఇవ్వడానికని వెళ్ళాను. అక్కడికి వెళ్ళకముందే తెలిసినా - అక్కడికి వెళ్ళాక ఉండవలసిన కమిట్‌మెంటూ, వదులుకోవలసిన కమిట్‌మెంట్సూ రెండూ బాగా అర్థమయ్యాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో రూ.6000/- ఉద్యోగం వదులుకుని రూ.2000/- స్టైపెండుతో నా హాబీ నెరవేర్చుకోబూనడం నాకేమాత్రమూ సబబని గానీ, సమంజసమని గానీ అనిపించట్లేదు.

అసలు ఆత్మావలోకనం - ప్రశ్నాపత్రం ఎంత బాగుందని? అది పూర్తి చేస్తోంటే కోటి ఆశలు మొలకెత్తాయి. నా పేపరు, నాతెలుగు వీటికి నేను ఎంతో చేయాలనుకుంటూనే ఉన్నాను. కేవలం ఆర్థికపరమైన కారణాల వల్ల అది నెరవేరకపోవడం దురదృష్టమో కాదో నాకు అర్థం కావడం లేదు. ప్రిన్సిపాల్ జె.నాగేశ్వర్రావు గారి ఇంట్రడక్టరీ క్లాసు వింటూంటే మనసు అలా ఊహల్లో విహరించింది. ఆ అనువాదాలు, లైబ్రరీ, పుస్తకాలు, చదువు, అసైన్‌మెంట్సు - ఓహ్ - ఒకటేమిటి!!!! - నిజంగా మనసుంటే మార్గముంటుందంటారు.....
అది అబద్ధమనిపిస్తోంది - మొట్టమొదటిసారిగా....

ప్రతీదానికీ నాన్నగార్ని తప్పు పట్టాలన్నా చిరాకు పుడుతోంది. దానివల్ల ప్రయోజనమేమీ లేకపోగా ఊరికే ఆయన్ని ఆడిపోసుకోడమొకటే లోకానికి కన్పిస్తూంటుంది.

ఇపుడు నన్ను సెలెక్టు చేసినప్పటి ఇంటర్వ్యూ గుర్తొస్తోంది. - మీలో మీకు నచ్చని అంశాలేమిటి అని ఈ నాగేశ్వర్రావుగారే అడిగారు. చాలామంది నాకు దురుసుతనం ఉందంటారు. కానీ కొన్ని సందర్భాల్లో అది అవసరమే అని నాకు అనిపిస్తుందని సమాధానం చెప్పాను. అందుకు ఆయన, అంటే కొన్ని సందర్భాల్లోనైనా దురుసుతనం అవసరమేనంటారా అని తిరిగి ప్రశ్నించారు.
అయితే నేను ఆయా సందర్భాల్లో ఆ గుణానికి ఆ పేరు పెట్టలేనని సమాధానమిచ్చాను.
1992లో తిరుపతి ఈనాడు యూనిట్‌లో పనిచేసిన రోజులూ అనుభవాలూ మనసుని ముప్పిరిగొన్నాయి.

రేపే నా అంగీకార పత్రాన్ని వాపసు చేయడానికి నిశ్చయించుకున్నాను.
12000 మందిలో ఎంపికయిన 42 మందిలో నేనొకణ్ని అనిపించుకున్నాక మళ్ళీ మళ్ళీ ఇటువంటి అవకాశం వస్తుందా, వచ్చినా వాళ్ళు మళ్ళీ లోపలికి రానిస్తారా, కాళ్ళముందరికి వచ్చిన ఎంపికని తన్నేసుకుంటున్న నాలాంటివాడికి నేను కూడా మళ్ళీ అవకాశమివ్వను.

పాపం శాంతమ్.....
శ్రీ నాగేశ్వర్రావు గారికి కృతజ్ఞతలు.

2 comments:

చక్రవర్తి said...

ఇంతకీ తమరు జర్నలిజం (ఈనాడు) కోర్సులో జాయినింగ్ రిపోర్టు ఇచ్చారా .. లేదా?

మీ అనుభవం నుంచి మీరు తెలియజేసేది ఏమిటి? జర్నలిజం కోర్సులు లాంటి వాటికి ప్రయత్నాలు చెయ్యాలా వద్దా..

ఎందుకంటే, ఈ మధ్య నా అర్దాంగి, సాక్షి వాళ్ళు ప్రకటించిన జర్నలిజం కోర్సు ప్రవేశ పరీక్షకు హాజరయ్యింది. సాక్షి పత్రిక గురించి కాకపోయినా, ఎంతో కొంత జర్నలిజం గురించి తెలుస్తుంది కదా అని సరిపెట్టుకున్నా..

మీరైతే ఏమంటారు? మీ అనుభవంతో తెలియజేయగలరు.

కందర్ప కృష్ణ మోహన్ - said...

నేను చేరలేకపోయాననే కదా నా బాధ వెళ్ళబుచ్చుకున్నది.. ఇక స్వాతిగారు చేరడమా వద్దా అనేది తన ఇంట్రెస్టు,కోరిక,ఆసక్తి వగైరాల మీదే ఆధారపడి ఉంది గానీ నా అనుభవం మీద కాదని నామనవి.. తనకి ఆ జిజ్ఞాస ఉన్నట్లయితే మాత్రం తప్పక ప్రోత్సహించండి.

ఒక ఉద్యోగానుభవం.....

  సమావేశ మందిరంలో కొన్ని సెకండ్లు శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. జాయింట్ కలెక్టర్ శ్రీ బి.వెంకటేశం గారు అందుకుని, మేడమ్, ఈ విషయం పూర్తిగా కృష్...