Tuesday 30 September 2008

అమర ప్రేమ...

ఎన్నో సంవత్సరాల తర్వాత అమర్ ప్రేమ్ సినిమా చూశాను. కొన్ని సినిమాలు చూశాను అని అనుకోవడం చాలా తక్కువవుతుంది. ఆ పదం అస్సలు సరిపోదు. ఆ సినిమాని అనుభవించాను అనాలి. అప్పుడే ఆ అనుభూతి సంపూర్ణమౌతుంది. ఆ సంగీతమే మొత్తం సినిమాకి పెద్ద ఆస్తి. రాహుల్‌దేవ్ బర్మన్ లాంటి బిడ్డని కన్నందుకు సచిన్ దేవ్ బర్మన్ ఎన్నిసార్లు ఎంతగా మురిసి ఉంటాడో తెలీదు కానీ, కోట్లాది జనాలు ఆ సంగీతానికి ఇంకా ఇప్పటికీ మురుస్తూనే ఉన్నారు, ఉంటారు. ఇక అభినయం విషయానికొస్తే రాజేష్‌ఖన్నా, షర్మిలా టాగూర్, వినోద్ మెహ్రా, నందూ పిల్లవాడి పాత్రధారి - ఈ నలుగురిదే మొత్తం సినిమా.

ప్రేమ అనేది ఎటువంటి శారీరక సంబంధానికీ సంబంధం లేని అనుబంధం అనే మౌలికమైన విషయాన్ని ఎంతో హృద్యంగా, అందంగా, ప్రతీ క్షణమూ, సన్నివేశమూ కళ్ళలో నీళ్ళు చిప్పిల్లుతూనే ఉండే విధంగా చిత్రీకరించిన శక్తి సామంతా కి కోట్లాది కళాపిపాసులు, ప్రేమికులు జన్మజన్మలకీ ఋణపడే ఉంటారు. మొదటిసారి పుష్పని ఆనంద్ బాబు చూసిన సన్నివేశం - నందూని పుష్ప లాలించిన ప్రతీ సన్నివేశం - నందూ పెద్దయ్యాక పుష్పని వెతుక్కుంటూ జ్ఞాపకాల నైట్‌క్వీన్ పువ్వుల్ని ఏరుకునే సన్నివేశం - పుష్పని నందూ ఇంటికి తీసుకెళ్ళే సన్నివేశం - ఇలా ఒకటేమిటి, మొత్తం సినిమా, ప్రతీ ఫ్రేమూ ఒక కళాఖండం.

ఇంటికొచ్చేటప్పటికీ - ఈ అమర్ ప్రేమ్ సినిమా కడుపునిండా ఏడిపించింది. నా బెడ్‌రూమ్ లోకి వెళ్ళి గుండెలు పగిలేలా వెక్కి వెక్కి ఏడ్చాను. అంత ఏడుపు ఎందుకు అని ఎవరైనా అడిగితే నాదగ్గర ఒక వెర్రిచూపుకి మించిన సమాధానం లేనేలేదు. కానీ విషయం అర్థం చేసుకోగలిగిన వాళ్ళు అడగరు. విషయం అర్థం కానివాళ్ళు అడగలేరు. కాబట్టి నాఏడుపు నాది. అందులో ఉన్న సుఖం ఇంకెందులోనూ లేదని చివరికి రాజేష్‌ఖన్నాయే చచ్చినట్టు ఒప్పుకుని తనివితీరా ఏడుస్తాడు.

మరపురాని బాధ కన్నా మధురమే లేదూ..
గతము తలచి వగచేకన్నా సౌఖ్యమే లేదూ..

3 comments:

బ్లాగాగ్ని said...

సాహుల్ దేవ్?? ఆయన పేరు సచిన్ దేవ్ బర్మన్ అండీ. BTW, నాక్కూడా చాలా నచ్చిన సినిమాల్లో ఇదొకటి. కుఛ్ తో లోగ్ కహేంగే అన్న పాట కూడా చాలా ఇష్టం.

కందర్ప కృష్ణ మోహన్ - said...

అవునండీ మీరన్న తర్వాత అరే అదేమిటి అలా రాసేశాను అనుకున్నాను - సవరించుకున్నాను - బహుధా నెనర్లు..

Unknown said...

ఏదిచాను అని చెప్పుకూవడం ఒక అబ్బయికి చాలా ఎంబేరెసింగ్ గా ఉంటుంది. కానీ మీరు వ్రాసినప్పుడు ఆ నిజాన్ని నిర్లజ్జగా వ్రాసినతీరులో ఒక "జెన్యుఎన్నెస్స్" తొణికింది. It actually makes you realise just how similar we all are in some very basic human way!!!

ఒక ఉద్యోగానుభవం.....

  సమావేశ మందిరంలో కొన్ని సెకండ్లు శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. జాయింట్ కలెక్టర్ శ్రీ బి.వెంకటేశం గారు అందుకుని, మేడమ్, ఈ విషయం పూర్తిగా కృష్...