Monday 4 May 2020

లాక్ డౌన్ - జిందాబాద్

నలభై మూడు రోజుల తర్వాత ఈరోజు ఆఫీసుకు వెళ్ళాను.

నా 29 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఇన్ని రోజులు ఎప్పుడూ ఇంట్లో లేను. కాబట్టి ఇది కచ్చితంగా ఒక కొత్తదైన అనుభవమే.

కరోనా వైరస్ మనిషిలో ఏమీ చెప్పుకోదగ్గ మార్పు తేలేదని ఈరోజు మద్యం అమ్మకాల దగ్గర వాడి ప్రవర్తన బట్టి తెలిసిపోయింది. మనిషి తనను తాను చాలా గొప్పవాణ్ణి అని అనుకుంటూ ఎల్లకాలం గొప్పలు పోతూనే ఉంటాడు. ప్రకృతి మాత్రం చూసి చూసి వాడికి తట్లు తేలేలా గరిటె కాల్చి వాతలు పెడుతూనే ఉంటుంది. అయినా వాడికి మాత్రం సిగ్గు లేదు, రాదు.

ఉదయమూ సాయంత్రమూ కూడా మామూలు రోజుల్లోని రద్దీలో 10-15 శాతం మాత్రమే రోడ్ల మీద కనిపించారు. నాలుగు చెక్ పోస్టుల్లో రెండు చోట్ల మాత్రం కొంచెం ఆపి తనిఖీలు చేస్తున్నారు. అది కూడా, ఒక్కడూ వెళ్ళే ఏ బండినీ కూడా ఆపడం లేదు. కేవలం డబుల్స్ వెళ్ళేవాళ్ళను మాత్రమే ఆపి పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాసులు తీసుకుంటున్నారు.

ఉదయం వెళ్ళేటప్పుడు అదొక రకమైన గిలితో వెళ్ళాను కాబట్టి చుట్టుపక్కల పెద్దగా గమనించుకోలేదు కానీ, సాయంత్రం వచ్చేటప్పుడు మాత్రం ప్రశాంతంగా మొత్తం 9 కిలోమీటర్ల దూరమూ రోడ్డుకు ఇరువైపులా, ఎదురుగా అంతా, అన్నింటినీ నిదానంగా గమనించుకుంటూ వచ్చాను. ఆ క్రమంలో నాకు ప్రకృతి పైన ప్రేమ, గౌరవం రెండూ కొన్ని వందల రెట్లు ఇనుమడించగా, మనిషి మీద, మనిషి ప్రవర్తన మీద, వాడి అహంకారం మీద అంతకు రెట్టింపుగా అసహ్యం పెరిగింది. విషయం ఏమిటంటే, దాదాపు 7 కిలోమీటర్ల పొడవునా రోడ్డు డివైడర్ల మధ్యలోనూ, మెట్రో స్తంభాల మధ్యలోనూ ఉన్న రకరకాల మొక్కలు, చెట్లు, మరెన్నో రంగురంగుల పూలు కనువిందు చేశాయి. అందులో గొప్పేముందీ అంటారేమో, వస్తున్నా, అక్కడికే వస్తున్నా..😃😃 మొత్తం అన్ని మొక్కలు, చెట్లు, పూలు వేటిమీదా కూడా ఇసుమంత దుమ్ము లేదు, పొగచూరిన మరకలు లేవు. తళతళలాడుతూ గర్వంగా, ఆకుపచ్చగా మెరిసిపోవడమే కాక చాలాచోట్ల డివైడర్లను దాటి రోడ్లమీదకు పాకాయి. వాటి ఆనందం మీరు అనుభవించి చూడాల్సిందే. అవన్నీ కూడా కరోనాకు హృదయపూర్వక ధన్యవాదాలు అర్పించుకుంటూ ఆనందిస్తున్న అనుభూతి నాకైతే కలిగిందబ్బా...😍

ఒరే మనిషీ !?!?!
ఎందుకురా నీకు అంత పొగరు, మదం, అహంకారం ?? ఏం చూసుకుని ??
ఇప్పుడు చూడు నీ బతుకు ఎలా అయిందో 😏😏 బైటికి రావాలంటే ముక్కూ నోరూ ముఖమూ చేతులూ కాళ్ళూ అన్నీ మూసుకుని రా. బాగుందారా ఇప్పుడు ? తిక్క బాగా కుదిరిందా ఇప్పుడు ?

అని అవన్నీ నన్ను చూసీ చూడనట్లుగా మొహం తిప్పుకున్నట్టూ, వెటకారంగా మాటాడుకున్నట్టూ ఏదో వింత భావన..

నా దృష్టిలో, కనీసం సంవత్సరానికి రెండుసార్లు కనీసం పదిహేను రోజుల చొప్పున తప్పనిసరి లాక్ డౌన్ అమలుపరచాలి. అది మనిషి ఆత్రపు తిండిపోతుతనానికి ఆరోగ్యకరమైన ఉపవాసం లాగా, మనకూ ప్రకృతికీ కూడా చాలా మేలు చేస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

మనిషి మంచిగా మారినా మారకపోయినా, వాణ్ణి బలవంతంగా ఇంట్లో కూర్చోబెట్టి ప్రకృతికి దాని పవిత్రతనూ, సౌందర్యాన్నీ తిరిగి తెచ్చిన...

లాక్ డౌన్ - జిందాబాద్.. 🙏🙏🙏

11 comments:

Bhavanisms said...

బావుందండీ.

Dileep.M said...

బాగుందండీ

Unknown said...

chaalaa bagumdi sir

కళ్యాణి ముక్తేవి said...

మనిషి ఎప్పటికి మారడు...మారినట్లు కనిపించినా కూడా అది నలుగురి మెప్పుకోసమే.కుక్క తోక వంకర తీరుగా.

Anonymous said...

Very very good, normally when we walk we observe lot not while driving. You are able to observe because not much traffic is there. Other days you fight with vehicles gets bp, shout for the whole of drive because many idiots are driving. (Excuse me for writing in english, my Telugu typing sucks.)

Unknown said...

bavundhi sir

ram said...

బాగుంది అండీ

Ram said...

Meeku wine shops lo queues kanapadaledha..

VIJAYA SREE.N said...

దాదాపు 7 కిలోమీటర్ల పొడవునా రోడ్డు డివైడర్ల మధ్యలోనూ, మెట్రో స్తంభాల మధ్యలోనూ ఉన్న రకరకాల మొక్కలు, చెట్లు, మరెన్నో రంగురంగుల పూలు మొత్తం అన్ని మొక్కలు, చెట్లు, పూలు వేటిమీదా కూడా ఇసుమంత దుమ్ము లేదు, పొగచూరిన మరకలు లేవు. తళతళలాడుతూ గర్వంగా, ఆకుపచ్చగా మెరిసిపోవడమే కాక చాలాచోట్ల డివైడర్లను దాటి రోడ్లమీదకు పాకాయి. వాటి ఆనందం మీరు అనుభవించి చూడాల్సిందే. అవన్నీ కూడా కరోనాకు హృదయపూర్వక ధన్యవాదాలు అర్పించుకుంటూ ఆనందిస్తున్న అనుభూతి నాకైతే కలిగిందబ్బా. మనిషి నొక్కడిని అదుపులో పెట్ట గలిగితే ఈ ప్రకృతి అందాలు,ఆ పక్షుల కేరింతలు, మూగ జీవాల ప్రేమ, అనురాగం అన్ని కలబోసి భూమాత పరవశించి స్వర్గ లోకం లా కనిపిస్తుంది.

Bilalj8584 said...

Nice

Krishna Mohan said...

మీరు చెప్పింది అక్షరాలా నిజమండీ 😃

ఒక ఉద్యోగానుభవం.....

  సమావేశ మందిరంలో కొన్ని సెకండ్లు శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. జాయింట్ కలెక్టర్ శ్రీ బి.వెంకటేశం గారు అందుకుని, మేడమ్, ఈ విషయం పూర్తిగా కృష్...