Tuesday 20 April 2021

ఒక ఉద్యోగానుభవం.....

 

సమావేశ మందిరంలో కొన్ని సెకండ్లు శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది.

జాయింట్ కలెక్టర్ శ్రీ బి.వెంకటేశం గారు అందుకుని, మేడమ్, ఈ విషయం పూర్తిగా కృష్ణమోహన్ కే వదిలేద్దాం, ఏదైనా తేడా వస్తే తన జీతంలోనే రికవరీ పెడదాం, ఏమంటారు ?? అని సాలోచనగా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి గారివైపు చూసారు. ఆవిడ ముఖం చిన్నబోయింది. ఎర్రబడిన ముఖాన్ని దాచుకునే ప్రయత్నం కూడా ఆవిడేమీ చేయలేదు. మీ ఇష్టం సార్, కేవీఎస్ ప్రింటర్స్ వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా మనకు సప్లై చేస్తున్నారు, నమ్మకస్తులు, ఇక అంతకంటే చెప్పేదేమీ లేదు అని చీర సవరించుకుంటూ లేచారావిడ. ఆయన నవ్వుతూ, ఈసారికి పర్చేజ్ కమిటీకి ఛైర్మన్ గా మీరే ఉండండి మేడమ్ ఫర్వాలేదు, కృష్ణమోహన్ కేవలం ధరలు తక్కువ నాణ్యత ఎక్కువ ఉండేలా చూస్తాడంతే ఈసారికి ఇలా చేద్దాం అని అంటూనే, ఎవరి అంగీకారమూ అవసరం లేదన్నట్టుగా నోట్ ఫైల్ మీద సంతకం చేసేశారు వెంకటేశం గారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు నా వైపు తిరస్కారభావం, అసూయలతో కలగలిసిన ఒక చూపు విసిరి వెళ్ళిపోయారు.

సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం, అంటే 2001 ద్వితీయార్థం. కేంద్ర ప్రభుత్వ కార్మికశాఖ గ్రాంటు ద్వారా నడిచే జాతీయ బాలకార్మిక ప్రాజెక్టు చిత్తూరు జిల్లా కార్యాలయంలో ఫీల్డ్ ఆఫీసర్ గా పని చేస్తున్న రోజులవి. ప్రభుత్వోద్యోగం అంటే చిన్నప్పటినుంచీ నాన్నగారితో తిరిగి తిరిగీ అదో రకమైన ఆరాధనాభావం. ఏదో చేయొచ్చు, ఎంతో చేయొచ్చు అనే ఒక వెర్రి నమ్మకం చాలా బలంగా ఉండేవి. ఈ ఉద్యోగం కూడా నాన్నగారు చెబితేనే వచ్చింది. సదరు ప్రాజెక్టు డైరెక్టరు మేడమ్ గారు జిల్లా సహకార శాఖాధికారిణి కూడానూ.  అంటే నాన్నగారు అప్పటికి రెండేళ్ళ క్రితం సహకారశాఖ సబ్ రిజిస్ట్రార్ గా రిటైరయ్యేటప్పటికి ఆవిడే ఆయనకు అధికారిణి. అలా ఆయన మీద ఉన్న సదభిప్రాయంతో ఈ తాత్కాలిక ఉద్యోగం 2001 జనవరిలో నాకు వచ్చేేేలా చూసారావిడ. కానీ, 2-3 నెలల కాలంలోనే వీడు తండ్రి లాగా "నొప్పింపక తానొవ్వక" రకం కాదు అని ఆవిడకు అర్థమైపోయింది. ఫీల్డ్ ఆఫీసర్ అంటే అసలుకైతే కేవలం జిల్లాలో ఉన్న (అప్పటికి దాదాపు 40 ఉండేవి) బాలకార్మిక పాఠశాలలకు రోజూ వెళ్ళి వాళ్ళ హాజరు, సౌకర్యాలు సరిగా ఉన్నాయో లేవో చూసి ప్రాజెక్టు డైరెక్టర్ గారికి నివేదిక ఇవ్వడం, అంతవరకే. కానీ మనకు అప్పటికే దాదాపు పదేళ్ళ అకౌంట్స్ అనుభవం ఉండబట్టి అదంతా కూడా అప్పనంగా వాడేసుకుందామనే ఆవిడ అత్యాశ ఆవిడకే బెడిసి కొట్టిందని చెప్పాలి. ప్రాజెక్టు నిధుల వినియోగ ధృవీకరణ పత్రాలు తయారుచేసి ఎప్పటికప్పుడు కేంద్ర కార్మికశాఖకు పంపడం, గత సంవత్సరపు చిట్టాపద్దులు సరిచూడడంలో ఆడిటర్ కి సహాయపడడం (అతను కూడా చాలానే ఇబ్బంది పడ్డాడు నాతో 😁) ప్రాజెక్టు డైరెక్టర్ గారివి నావి నాతోపాటు ఉన్న ఇంకొక ఫీల్డ్ ఆఫీసర్ వి ప్రయాణపు బిల్లుల తనిఖీ ఇలా ఆఫీసు పనులు కూడా జాగ్రత్తగా నాకే బదలాయించారావిడ. అంటే పనికి భయపడి పారిపోతానని భ్రమపడి 😄. మనమేమో ఇంకా ఇంకా అభిమన్యుడిలా చొచ్చుకుపోయి సిస్టమ్స్ అండ్ స్టాండర్డ్స్ కూడా మార్చే స్థాయికి వెళ్ళిపోయే క్రమంలో జరిగినదే పై సంఘటన.

ప్రతీ సంవత్సరం సదరు నలభై బాల కార్మిక పాఠశాలల్లో ఉండే రమారమీ 1600 మంది పిల్లలకు కావలసిన, పుస్తకాలు, పలకలు, బలపాలు, పెన్నులు వగైరా స్టేషనరీ సామగ్రి, యూనిఫారం, రింగ్ బాల్స్, స్కిప్పింగ్ రోల్స్, కేరంబోర్డులు వగైరా ఆటసామగ్రి అన్నింటికీ టెండర్ కాల్ ఫర్ చేసి, అతి తక్కువ ధరలకు ఎవరు కోట్ చేస్తే వారి దగ్గర నుంచి అన్నీ కొని పిల్లలకు ఉచితంగా పంచిపెట్టడం అనేది ఆ ప్రాజెక్టులో రెగ్యులర్ గా జరిగే పని అన్నమాట. ప్రాజెక్టు ఆఫీసు తిరుచానూరు రోడ్డులో ఉన్న అన్నగారి కాలంలో కట్టించిన మహిళా ప్రాంగణంలో ఉండేది. అమ్మగారేమో మునుపే చెప్పినట్లుగా చిత్తూరు డీసీఓ. కాబట్టి, ముందున్న పరిచయాలతో కాబోలు, ప్రతీ ఏటా చిత్తూరు పాత బస్టాండు దగ్గరలో ఉన్న కేవీఎస్ ప్రింటర్స్ వారికే ఈ మొత్తం ఆర్డర్ నిరాటంకంగా వెళ్ళిపోయేది. ఏది ? కేవలం వాళ్ళు ఆఫ్ సెట్ ప్రింటర్స్ అయినా కూడా పైన చెప్పిన అన్ని వస్తువులూ వారే సరఫరా చేసేట్టుగా ఒప్పందం జరిగిపోయేది. లోపాయికారీ అని అనలేను, ఎందుకంటే నా దగ్గర ఋజువులు లేవు కాబట్టి 😉

మరి ఆ సంవత్సరం మాత్రం మన ప్రతిభ మనం ప్రదర్శించాలి కాబట్టి, మేడమ్ గారిని అడిగితే, మీకు తెలుసా నాణ్యత, ధరల గురించీ, తక్కువకు తీసుకురాగలరా, పర్చేజ్ కమిటీ ఛైర్మన్ జాయింట్ కలెక్టర్ అక్కడ !!?? అని ఓఓఓ భయపెట్టడానికి ప్రయత్నం చేసీ కూడా, ఆఆఆ.. ఏం చేస్తాడులే కుర్రవాడు చూద్దాం ఏం తెస్తాడో అని నా ప్రతిపాదనకు సరే అన్నారు. శాంపుల్ గా ఆట సామగ్రి కోసం తిరుపతిలోనూ, యూనిఫారం కోసం చిత్తూరు దివ్య టెక్స్ టైల్స్ నుంచీనూ (మనకు గణేషన్న మంచి దోస్తు లెండి 😍) కొటేషన్లు తీసుకుని కథ మొదట్లో చెప్పిన పర్చేజ్ కమిటీ మీటింగ్ లో జాయింటు కలెక్టర్ వారి దివ్య సముఖమునకు సమర్పించితిని. అవి చూసిన జాయింట్ కలెక్టరు దిమ్మ తిరిగి మైండు బ్లాకయినది 😁. శ్రీమాన్ కేవీఎస్ ప్రింటర్ వారు కోట్ చేసిన యూనిఫారం మీటరు ధర రూ.85 ఐతే నేను ఇచ్చిన ధర రూ.35. వారు ఇచ్చిన రింగ్ బాల్ ధర రూ.35 ఐతే నేను ఇచ్చిన ధర రూ.15. అందునా కేవలం ధరలు మాత్రమే కాదు, ఆ ధరలతో పాటు జతపరచిన శాంపుల్స్ నాణ్యత చూసి జాయింట్ కలెక్టర్ గారు వాళ్ళవి విసిరేసినంత పని చేశారు..😂

కావున, పై సమావేశం అలా జరిగి, ఆ నిర్ణయం తీసుకుని నా మీద ఆ బాధ్యత వేయడంతో ఖంగుతిన్న ఆవిడ, కక్షకొద్దీ స్టేషనరీ మొత్తం ఆర్డర్ కూడా వాళ్ళకు ఇవ్వకుండా రద్దు చేసి, ఇవి కూడా మీరే తిరిగి తక్కువకు పట్టుకురండి అని పురమాయించింది. అదేదో నాకు శిక్షలాగా..😄 బ్యాక్ గ్రౌండ్ లో మళ్ళీ ఆ కేవీఎస్ వాళ్ళకు చీవాట్లేసి, అన్నీ వీలైనంత తగ్గించి కొటేషన్ తీసుకురండయ్యా అని చెప్పి పంపించింది కూడా. అదీగాక, ఆవిడకు నేను తెచ్చిన కొటేషన్లు చూడడం నామోషీ అనిపించి, జాయింట్ కలెక్టర్ గారు ఆవిడకు కట్టబెట్టిన విశేషాధికారం ఉపయోగించి, డిస్ట్రిక్ట్ కోపరేటివ్ ఆడిట్ ఆఫీసర్ గారైన శ్రీ సుబ్బారావు గారిని నా పైన అధికారిగా నియమిస్తూ నోట్ ఫైల్ లో వ్రాసి పడేసింది. నాన్నగారి ద్వారా ఆయన నాకు ముందే పరిచయం ఉన్నట్టు ఆవిడకు తెలియదు. అయినా పనిలో అవినీతి లేని మనకు ఎవరైతే ఏంటి చెప్పండి 😎 నేనేమో పరమానందంగా స్వీకరించి ఇంకో రెండు రోజులు తిరిగి అన్నీ పట్టుకొచ్చి ఆయనకివ్వడం, ఆయన శుభ్రంగా ఓకే చెప్పడం, ఆవిడ ఈగో శాటిస్ఫై చేయడానికి ఒకట్రెండు వస్తువులు ఈయన రిజెక్టు చేసినట్టు వ్రాసి, అవే వస్తువులు మళ్ళీ తెచ్చినట్టు చూపించి ఎలాగైతేనేం మొత్తానికి ఫైనలైజ్ చేసి జాయింట్ కలెక్టర్ గారిముందు పెట్టాం. టోకుమొత్తంగా రెండున్నర లక్షల రూపాయల వరకూ ఆదా చేసినట్టుగా పట్టిక తయారుచేసి (అప్పుడప్పుడే విండోస్98 లో నేర్చుకున్న ఎక్సెల్ లో😎) ఆయన ముందు పెడితే నా సామిరంగా ఆవిడ ముఖచిత్రం చూడాలీ....😂😂😂

మొత్తం అన్ని వస్తువులూ నేనే ప్రొక్యూర్ చేసి నేనే రిసీవ్ చేసుకుని అన్ని పాఠశాలలకూ సమన్యాయం పాటిస్తూ నేనే స్వయంగా అందించినప్పటి నా అనుభవం, అనుభూతి నేను ఇక్కడ ఇలా మాటల్లో వర్ణించలేను...

ఇంకా ఇంకా ఇలాంటి మరెన్నో ఉద్యోగానుభవాలతో మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తానని మాట ఇస్తూ...

మీ అందరి అభిమానపాత్రుడు
కందర్ప కృష్ణమోహన్ 

5 comments:

Chandra said...


👏👏👏🤗
నిజాయితీ, నిబద్ధతల నిర్వచనం వయసుతో పాటు మారుతుంటాయి చాలామందికి, నిత్య జీవితంలో ఎదురయే సమస్యల ఉధృతిని తట్టుకోలేక కొంత, మనం కోరుకున్నది పొంది తీరాలనే ఆశల రేసుల ఉన్మాదం మరికొంత జోడై.

ప్రలోభాల పాకుడురాళ్ళమీద పట్టుతప్పి పడిపోకుండా నిన్ను నీవు ఇంతకాలమూ నియంత్రించుకుంటూ, పదుగురికీ ఆదర్శంగా నిలబడుతున్నందుకూ, అభినందనలు మోహన్. నీవెప్పటికీ ఇలాగే నిలవాలనీ, నీ ప్రతి అడుగులోనూ జయం చేకూరాలని మనసారా కోరుకుంటూ...

ప్రేమతో,
చందు
@Chandu1302

Bhavanisms said...

నిజాయితీగా పనిచేస్తే ఎవరికీ నచ్చదు. కానీ ఎవరికో నచ్చాలని మనం మన మనస్సాక్షికి మోసం చేయలేము కదా.
హాట్సాఫ్ మాష్టారు. 🙏🙏🙏👏👏👏

Krishna_T@N CH said...

చాలా చక్కగా పంచారు మామయ్యా మీ అనుభవాన్ని..నాలాంటి నూతన కర్మచారులకు మీ అనుభవం, జిజ్ఞాస ఎంతో నేర్పిస్తున్నాయి..

Ghouse Mohiddin said...

Its your commitment for justice and hatred towards corruption.
Keep it up forever.
Cheers Mohan

Sai said...

ఒకడే ఒక్కడు మొనగాడు
ఊరే మెచ్చిన పనివాడు
విధికి తలొంచడు ఏనాడు
తల ఎత్తుకు తిరిగే మొనగాడు
భూమిని చీల్చే ఆయుధమేల
పువ్వుల కోసం కొడవళ్ళేల
మోసం ద్వేషం మరచిన నాడు
ఆనందాలే విరియును చూడు....


సూపర్ అన్నయ్య.

ఒక ఉద్యోగానుభవం.....

  సమావేశ మందిరంలో కొన్ని సెకండ్లు శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. జాయింట్ కలెక్టర్ శ్రీ బి.వెంకటేశం గారు అందుకుని, మేడమ్, ఈ విషయం పూర్తిగా కృష్...