Friday 2 August 2019

మంచితనం

మంచితనం అంటే..

A. స్వతహాగా పుట్టుకతో మంచిని కలిగి ఉండడం
B. తల్లిదండ్రుల పెంపకంతో మంచిని అలవర్చుకోవడం
C. తన స్వీయానుభవంచేత మంచిని అలవర్చుకోవడం
D. మంచి అనిపించుకోవడానికి మంచితనాన్ని ఇష్టపూర్వకంగా కలిగి ఉండడం
E. మంచి అనిపించుకోవడానికి మంచితనాన్ని బలవంతంగా కలిగి ఉండడం
F. మంచిగా కనిపించడానికి మాత్రమే మంచితనాన్ని కలిగి ఉన్నట్లు కనిపించడం
G. మంచిగా కనిపించడానికి మంచిని నటించడం

ఇన్ని వైవిధ్యాలలో మనం రోజూ ఎదుర్కునే సందర్భాల్లో ఏది నిజం, ఏది అబద్ధం, ఏది సహజం, ఏది నటన, కనుక్కోవడం చాలా కష్టమని అనిపించడం సహజం. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక గమ్మత్తైన విషయం గ్రహింపులోకి వస్తుంది. జీవితంలో అన్ని సందర్భాల్లోనూ అంతమందీ పై లక్షణాల్లో ఒకే రకమైన ప్రవర్తనతోనూ ఉండరు, అలాగని అన్ని రకాల ప్రవర్తనతోనూ ఉండరు. శాతాలు మారవచ్చుగానీ ఏదో ఒక సందర్భంలో తప్పనిసరయ్యో, తప్పు లేదనిపించో, సహజంగానో, స్వంతంగానో, పక్కవాడి దగ్గరో, ఎదుటివాడిలోనో ఎలాగో అలాగ అందరూ అన్నిరకాల లక్షణాలనూ గ్రహింపులోకి తెచ్చుకునే ఉంటారని నాకనిపిస్తుంది. ఎందుకు అంటే లోకంలో మంచికి ఉండే ఆకర్షణ, అవసరం అటువంటిది.

నేను గమనించిన ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, పైన వర్గీకరించినవారిలో ప్రతీ క్రింది వ్యక్తి మాత్రమే తన పైని వ్యక్తులందరి స్వభావాలను సులభంగా గుర్తించగలుగుతాడు. ప్రతీ పైని వ్యక్తీ తన క్రిందివారందరి స్వభావాలను గుర్తించడంలో బాగా ఇబ్బంది పడతాడు.

ఈ సోదంతా ఎందుకు ఇప్పుడూ అంటే, ఏదో ఒక కారణంచేత, మంచిగా ఉండడానికే ప్రతీ వ్యక్తీ మొగ్గు చూపాలనీ, కనీసం అలాగైనా మంచి వ్యాప్తి చెందాలనీ కోరుకోవడం తప్ప ఇందులో వేరే స్థూల సూక్ష్మ కారణ శరీరాలింకేమీ లేవు.

అలాగే, అసలు మంచీ చెడూ సాపేక్షమేనోయ్, అవేమీ స్థిరమైన నిర్వచనమూ, లక్షణాలూ కలిగినవి  కావోయ్ అని సుద్దులు చెప్పేవాళ్ళూ ఉంటారు, కాదనడం కష్టమే. కానీ, ఒక పరమోత్కృష్టమైన భావసంపద కలిగి ఉండడంలోని మంచినీ, ఒక పరమ నికృష్టమైన నీచ బుద్ధులను కలిగి ఉండడంలోని చెడునూ ఎవరూ కాదనలేరు కదా.. అంటే ఉదాహరణకు, అబ్దుల్ కలామ్ చెడ్డవారు, కీచకుడు మంచివాడు అని ఎవరైనా అనగా, అనుకోగా నేను ఎప్పుడూ వినలేదు, ఊహించలేదు కూడా. అలాగ, ఆ పద్ధతిలో మంచీ చెడులకు కూడా నిర్వచనాలు ఉన్నట్టేగా. అదన్నమాట సంగతి.

అసలు ఈ మంచితో సంబంధమే లేని, అవసరమే  లేదనుకునే చెడ్డవాళ్ళగురించి ఇంకోసారెప్పుడైనా మాట్లాడతాను.

మీ విలువైన అభిప్రాయాలను స్వాగతిస్తూ, ఎప్పుడూ ABC ల మధ్య తారట్లాడే మీ అందరి..
కృష్ణమోహన్

4 comments:

Mahesh Kumar Koramutla said...

మీ కూర్పు లోని విషయాలు సంగ్రహింవచ్చా?

TSivaprasad.com said...

"సొంత జీవితపు పూలు-ముళ్ళు..." ఎంత చక్కని శీర్షిక! ఎదురుగా కనిపించే మనుషులను ఎంతో లోతుగా పరిశీలిస్తే తప్ప ఇంత గొప్ప విశ్లేషణ సాధ్యం కాదు. చాలా బాగా చెప్పారు సర్. - శివ ప్రసాద్.

Krishna Mohan said...

నిరభ్యంతరంగా..

Krishna Mohan said...

🤗🤗🙏🙏

ఒక ఉద్యోగానుభవం.....

  సమావేశ మందిరంలో కొన్ని సెకండ్లు శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. జాయింట్ కలెక్టర్ శ్రీ బి.వెంకటేశం గారు అందుకుని, మేడమ్, ఈ విషయం పూర్తిగా కృష్...