Sunday 8 December 2019

పొదుపు - మీ జీవితపు మలుపు

చాలామంది దృష్టిలో పొదుపు అంటే ఒక ఆపత్కాల నిధి మాత్రమే. కానీ నా స్వీయానుభవంలో నేను తెలుసుకున్నది, పొదుపు అంటే కేవలం ఆపత్కాల నిధి మాత్రమే కాదు. పొదుపు అంటే, ఒక కుటుంబ భవిష్యత్తు. పొదుపు అంటే కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు. ఒక వ్యక్తి సంపాదన అంటే, చాలా తక్కువ జీవితాల్లో తప్పితే మిగతా అందరికీ కూడా అది మొత్తం కుటుంబానికే ఆధారం.

అటువంటి సంపాదనతో ఒక కుటుంబాన్ని బతికించే బాధ్యత కలిగిన వ్యక్తి, కేవలం సంపాదన మీద మాత్రమే దృష్టి పెడితే సరిపోదు. ఆ వ్యక్తి నిజంగా తన బాధ్యతను సంపూర్ణస్థాయిలో నెరవేర్చాలి అంటే, తన జీవితకాలం మీద, తన జీవితకాలంలో తన ఆరోగ్యస్థితిమీద, తన జీవితకాలపు సంపాదన మీద, తన జీవితకాలపు సంపాదనమీద ఆధారపడిన ప్రతీ కుటుంబసభ్యుని ఆరోగ్యస్థితి మీద, అవసరాలమీద తనకు సంపూర్ణమైన అవగాహన ఉండి తీరాలి. అలాంటి అవగాహన ఉన్నప్పుడు, ఆ వ్యక్తి తన సంపాదనను సరైన దామాషాలో విభజించుకుని, ఆదాయానికి తగిన ఖర్చులకు సరిపడా పక్కకు తీసుకుని మిగతా మొత్తాన్ని భవిష్యత్ కోసం దాచడాన్నే పొదుపు అనుకోవచ్చు. ఇంతకు మునుపే తాతలు తండ్రుల ద్వారా సంక్రమించిన ఆస్తిని మరింత జాగ్రత్తపడి పెంచుకోవడం కూడా పొదుపు లాగానే పరిగణించవచ్చు.

కానీ, మానసిక సంతృప్తికీ, భావోద్వేగాలకూ ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే భారతదేశంలాంటి దేశంలో ఈ పొదుపుకు మనం ఇచ్చే ప్రాధాన్యత నూటికి పదిశాతం కూడా ఉండదని, లేదని కుండలు బద్దలుకొట్టి (అవి పొదుపు చేసుకుని ఉంటే) చెప్పవచ్చు. కానీ మారుతున్న సామాజిక, ఆర్థిక, భౌగోళిక, మానసిక, శారీరక పరిస్థితుల దృష్ట్యా సగటు భారతీయ పౌరుడు తన ఆలోచనావిధానాన్ని మార్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా, వ్యక్తి తన ప్రస్తుత అవసరాలు తీరడానికి, భవిష్యత్ కోరికలు తీర్చుకోడానికి కూడా తగినంతగా సంపాదించే నైపుణ్యాన్ని కలిగి ఉండడమే కాక, అటువంటి సంపాదనను కనీసం రెండు సంవత్సరాల అవసరాలకు సరిపడా నగదును ఎప్పుడూ కలిగి ఉంటేనే ఆ వ్యక్తి పొదుపు చేయడంలో సఫలమైనట్లు నా వ్యక్తిగత అభిప్రాయం.

ఇది పొదుపుపైన నా స్థూలమైన అంచనా.

ఇక నీతులు చెప్పడం అయిపోయింది కాబట్టి నా విషయానికొస్తాను.

మా ముత్తాతలు మండపేటలో కొన్ని వందల ఎకరాలకు జమీందార్లు. తాతగార్ల కాలానికొచ్చేటప్పటికి వారు సరైన జాగ్రత్త పడకపోవడంవలన, కుటుంబంమీద కంటే వ్యక్తిగత విలాసాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినమీదట ఆ ఎకరాలు కాస్తా హరించుకుపోయాయి. ఇంత జరిగాక కూడా నా తండ్రి తరంవాళ్ళు కూడా ఎటువంటి జాగ్రత్తా పడలేదు సరికదా నా తరానికి అప్పులు మిగిల్చారు. నేను ఈ విషయాన్ని వారిమీద నింద మోపడానికో నా అజాగ్రత్తను కప్పిపుచ్చుకోవడానికో చెప్పడంలేదు. వాస్తవాన్ని నిర్భయంగా ఒప్పుకోగలిగిన సత్తాతో చెప్తున్నాను. నా తాతల తండ్రుల తరానికీ, నాకూ కనీసం ఆ తేడా అయినా ఉందని నేను అనుకుంటాను.

కానీ, ఇంత విశ్లేషణ చేయగలిగీ, ఇంతగా మంచీ చెడూ తెలిసీ కూడా, నేను కూడా పొదుపు విషయంలో ఎటువంటి జాగ్రత్తా పడలేదు అని చెప్పడానికి సిగ్గు పడుతున్నాను. (అని చెప్పుకోడానికి సిగ్గు పడడంలేదు)

నేను 1991లో పని చేయడం మొదలెట్టినప్పట్నుంచీ ఇప్పటివరకూ దాదాపు 85 లక్షలు సంపాదించినట్టు ఈమధ్య నేను వేసుకున్న లెక్కలో తేలింది. అయితే నేను మొన్న ఒక ట్వీట్‌లో చెప్పినట్టుగా 30 శాతం పొదుపు అంటే కనీసం 25 లక్షలైనా పొదుపు చేసి ఉండాలి లేదా అందుకు సమానమైన స్థిరాస్తినైనా సమకూర్చుకుని ఉండాలి. ఏదీ జరగలేదు. 0.01 శాతం కూడా జరగలేదు.

అలాగే, ఇంకా విషాదకరమైన విషయమేమిటంటే, నాకు ఈ విశ్లేషణ, జ్ఞానం ఇప్పుడే కొత్తగా అలవడినవి కావు. మా నాన్నగారి ప్రతీ తప్పటడుగూ చూసినప్పుడల్లా నేర్చుకున్నాను. నా రెండవ తరగతి నుంచి నా పెళ్ళివరకూ కూడా ప్రతీ పైసనీ తన పరిధిలో తను పొదుపు చేసి, దాచి మా కనీస అవసరాలకు లోటు రాకుండా చూసిన మా అమ్మగారి కష్టాన్ని చూసిన ప్రతీ క్షణమూ నేర్చుకున్నాను. నాకు బుద్ధెరిగి, 1980లో పరిచయమైనప్పటినుంచీ దాదాపు డెబ్భై ఏళ్ళవయసులో, 2001 లో కీర్తిశేషులైన మా తాతగారు (అమ్మ నాన్నగారు) తన చివరిరోజు ఏలూరులో ఎక్కిన రిక్షా ఖర్చు 5/- కూడా పద్దు వ్రాసుకున్న క్షణం వరకూ కూడా నేర్చుకున్నాను. అయినా సరే నాకు అర్థమైన, నాకు తెలిసిన జాగ్రత్తలు కూడా నేను తీసుకోలేదు. ఫలితం – ఈరోజు పొదుపు చేసి దాచుకున్న ఎటువంటి మొత్తమూ లేదు. చాలాసార్లు నెలవారీ ఆర్డీ ఖాతాలు కూడా తెరవడం, 6-7 నెలల్లోపే మూసేయడం కూడా జరిగింది. 10-15 సంవత్సరాలు క్రమం తప్పక కట్టుకున్న బీమా పాలసీల మొత్తం కూడా ఒకానొక కష్టసమయంలో, ఎవరినుంచీ ఎటువంటి సహాయమూ అందని కొన్ని క్లిష్టపరిస్థితుల్లో హరించుకుపోయింది.

ఇందుకు కారణాలు నేను ఈవిధంగా విశ్లేషించుకున్నాను.

1. కనీసం డిగ్రీవరకూ కూడా చదువు చెప్పించకపోగా, నా సోదరి వివాహం, నా వివాహం ఖర్చులు కూడా నాపైనే తోసేసిన నా తండ్రి అసమర్థ ఆర్థిక నిర్వహణ. (క్షమించాలి, నా తండ్రిమీద నాకు ఎటువంటి ఫిర్యాదులూ లేవు, కోపమూ, ద్వేషమూ అసలే లేవు. కూసింత జాలి తప్ప)

2. ఇంత విశ్లేషణా జ్ఞానం ఉండీ కూడా నా సంపాదన మీద, నా అవసరాల మీద, నా భవిష్యత్ మీద నేను సరైన అవగాహన పెంచుకోకుండా, నా సంపాదనలో చాలాభాగం, నా మానసిక సంతృప్తి కోసం, భావోద్వేగాల కోసం, ఇంకా కొన్ని దుబారా విషయాలకు మాత్రమే ఖర్చు పెట్టేయడం.

కాబట్టి మిత్రులారా, ఇంకా బాధ్యతతో కూడిన జీవితం మొదలుపెట్టని యువకుల్లారా, కచ్చితంగా పొదుపు చేయండి. అదికూడా మీ మీ సంపాదనలో 30 శాతం నిర్దాక్షిణ్యంగా పొదుపు చేయండి. అది మీకు, మీ కుటుంబసభ్యులకి పిసినారితనంగా కనిపించినా సరే మానకండి. పై విషయాలు మీరంతా నామీద జాలిపడడానికో, సానుభూతి చూపించడానికో, నేను మంచి అనిపించుకోవడానికో, ప్రదర్శన కోసమో చెప్పడం లేదు. నన్ను నమ్మండి. కేవలం, కేవలమంటే కేవలం, కనీసం నాకు పరిచయం ఉన్న నా తర్వాతి తరమైనా జాగ్రత్తపడి, వారైనా సుఖపడాలని చెప్తున్నాను. అంతే తప్ప ఇందులో ఎటువంటి స్వార్థానికీ, నా పెద్దల పట్ల ద్వేషానికీ, నా జీవితం పట్ల నాకు అసంతృప్తికి గానీ అస్సలు తావు లేదు.

కొంచెం బాధాకరమైనా సరే, నా మనసులోని మాటలు తన ప్రశ్న ద్వారా బైటకు చెప్పించి మంచికి సహాయపడిన ట్విట్టర్ మిత్రుడు దేవీప్రసాద్‌కీ, ఈ విషయాల్లో ఇంతకుమునుపే మంచిమంచి మాటలు తన బ్లాగులో మనతో పంచుకున్న నా తమ్ముడివరస తమ్ముడు ప్రియమైన ఆదిత్యకీ, తెలుగు బ్లాగు దినోత్సవం (డిసెంబర్ రెండవ ఆదివారం) సందర్భంగా ఈ విషయాన్ని బ్లాగులో పంచుకోవాలనే ప్రేరణ కలిగించిన ప్రియమిత్రుడు, తెలుగోద్ధారకుడు వీవెన్ గారికి నా మనఃపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నా ఈ పోస్టు ఎవరినైనా తెలిసో తెలియకో నొప్పించి ఉంటే వారికి క్షమాపణలు తెలుపుకుంటూ, సెలవు. 🙏

6 comments:

Unknown said...

నేను మొదలు petalandi బాబోయ్ మీరు రాసింది చదివాకా రేపు ఫస్ట్ అదే పని చేస్తా🙏

tvs here said...

కొన్ని సార్లు అనుభవాలు కూడా ఆర్ధిక పాఠాలు
అవుతాయి.... మీ పోస్ట్ చదవగానే నాకు కలిగిన
భావన ఇది. ఆర్ధిక పాఠాలు మరచిపోవచ్చునేమో కానీ
అనుభవాలను తొలిచి మలిచి చెప్పినవి కాబట్టి ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటాం 🙏🙏🙏

Krishna Mohan said...

🙏🙏🙏

TSivaprasad.com said...

ఇది రచయిత స్వంత అనుభవమే కావచ్చు కానీ, ఇప్పుడిప్పుడే జీవితం మొదలు పెడుతున్న యువతకు - ఆర్థిక శాస్త్రంలో మొదటి పాఠం. అబ్బాయిలు, అమ్మాయిలూ - చదవండి. పెద్దలూ - మీ పిల్లల చేత చదివించండి.

Ramaiah.g said...

చాలా మంచి విషయాలు చెప్పారు మోహన్ సార్సా ర్ ప్రతి మనిషి జీవితంలో పొదుపు అనేది చాలా అవసరం దాని గురించి చాలామంది పట్టించుకోవడం లేదు గానీ దాని వల్ల చాలా ఉపయోగం ఉంటుంది

I, me, myself said...

One lesson I learnt from my parents though they never literally ever said, never think about spending on necessities, think and spend on comforts, never spend on luxuries....

ఒక ఉద్యోగానుభవం.....

  సమావేశ మందిరంలో కొన్ని సెకండ్లు శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. జాయింట్ కలెక్టర్ శ్రీ బి.వెంకటేశం గారు అందుకుని, మేడమ్, ఈ విషయం పూర్తిగా కృష్...