Tuesday, 20 April 2021

ఒక ఉద్యోగానుభవం.....

 

సమావేశ మందిరంలో కొన్ని సెకండ్లు శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది.

జాయింట్ కలెక్టర్ శ్రీ బి.వెంకటేశం గారు అందుకుని, మేడమ్, ఈ విషయం పూర్తిగా కృష్ణమోహన్ కే వదిలేద్దాం, ఏదైనా తేడా వస్తే తన జీతంలోనే రికవరీ పెడదాం, ఏమంటారు ?? అని సాలోచనగా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి గారివైపు చూసారు. ఆవిడ ముఖం చిన్నబోయింది. ఎర్రబడిన ముఖాన్ని దాచుకునే ప్రయత్నం కూడా ఆవిడేమీ చేయలేదు. మీ ఇష్టం సార్, కేవీఎస్ ప్రింటర్స్ వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా మనకు సప్లై చేస్తున్నారు, నమ్మకస్తులు, ఇక అంతకంటే చెప్పేదేమీ లేదు అని చీర సవరించుకుంటూ లేచారావిడ. ఆయన నవ్వుతూ, ఈసారికి పర్చేజ్ కమిటీకి ఛైర్మన్ గా మీరే ఉండండి మేడమ్ ఫర్వాలేదు, కృష్ణమోహన్ కేవలం ధరలు తక్కువ నాణ్యత ఎక్కువ ఉండేలా చూస్తాడంతే ఈసారికి ఇలా చేద్దాం అని అంటూనే, ఎవరి అంగీకారమూ అవసరం లేదన్నట్టుగా నోట్ ఫైల్ మీద సంతకం చేసేశారు వెంకటేశం గారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు నా వైపు తిరస్కారభావం, అసూయలతో కలగలిసిన ఒక చూపు విసిరి వెళ్ళిపోయారు.

సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం, అంటే 2001 ద్వితీయార్థం. కేంద్ర ప్రభుత్వ కార్మికశాఖ గ్రాంటు ద్వారా నడిచే జాతీయ బాలకార్మిక ప్రాజెక్టు చిత్తూరు జిల్లా కార్యాలయంలో ఫీల్డ్ ఆఫీసర్ గా పని చేస్తున్న రోజులవి. ప్రభుత్వోద్యోగం అంటే చిన్నప్పటినుంచీ నాన్నగారితో తిరిగి తిరిగీ అదో రకమైన ఆరాధనాభావం. ఏదో చేయొచ్చు, ఎంతో చేయొచ్చు అనే ఒక వెర్రి నమ్మకం చాలా బలంగా ఉండేవి. ఈ ఉద్యోగం కూడా నాన్నగారు చెబితేనే వచ్చింది. సదరు ప్రాజెక్టు డైరెక్టరు మేడమ్ గారు జిల్లా సహకార శాఖాధికారిణి కూడానూ.  అంటే నాన్నగారు అప్పటికి రెండేళ్ళ క్రితం సహకారశాఖ సబ్ రిజిస్ట్రార్ గా రిటైరయ్యేటప్పటికి ఆవిడే ఆయనకు అధికారిణి. అలా ఆయన మీద ఉన్న సదభిప్రాయంతో ఈ తాత్కాలిక ఉద్యోగం 2001 జనవరిలో నాకు వచ్చేేేలా చూసారావిడ. కానీ, 2-3 నెలల కాలంలోనే వీడు తండ్రి లాగా "నొప్పింపక తానొవ్వక" రకం కాదు అని ఆవిడకు అర్థమైపోయింది. ఫీల్డ్ ఆఫీసర్ అంటే అసలుకైతే కేవలం జిల్లాలో ఉన్న (అప్పటికి దాదాపు 40 ఉండేవి) బాలకార్మిక పాఠశాలలకు రోజూ వెళ్ళి వాళ్ళ హాజరు, సౌకర్యాలు సరిగా ఉన్నాయో లేవో చూసి ప్రాజెక్టు డైరెక్టర్ గారికి నివేదిక ఇవ్వడం, అంతవరకే. కానీ మనకు అప్పటికే దాదాపు పదేళ్ళ అకౌంట్స్ అనుభవం ఉండబట్టి అదంతా కూడా అప్పనంగా వాడేసుకుందామనే ఆవిడ అత్యాశ ఆవిడకే బెడిసి కొట్టిందని చెప్పాలి. ప్రాజెక్టు నిధుల వినియోగ ధృవీకరణ పత్రాలు తయారుచేసి ఎప్పటికప్పుడు కేంద్ర కార్మికశాఖకు పంపడం, గత సంవత్సరపు చిట్టాపద్దులు సరిచూడడంలో ఆడిటర్ కి సహాయపడడం (అతను కూడా చాలానే ఇబ్బంది పడ్డాడు నాతో 😁) ప్రాజెక్టు డైరెక్టర్ గారివి నావి నాతోపాటు ఉన్న ఇంకొక ఫీల్డ్ ఆఫీసర్ వి ప్రయాణపు బిల్లుల తనిఖీ ఇలా ఆఫీసు పనులు కూడా జాగ్రత్తగా నాకే బదలాయించారావిడ. అంటే పనికి భయపడి పారిపోతానని భ్రమపడి 😄. మనమేమో ఇంకా ఇంకా అభిమన్యుడిలా చొచ్చుకుపోయి సిస్టమ్స్ అండ్ స్టాండర్డ్స్ కూడా మార్చే స్థాయికి వెళ్ళిపోయే క్రమంలో జరిగినదే పై సంఘటన.

ప్రతీ సంవత్సరం సదరు నలభై బాల కార్మిక పాఠశాలల్లో ఉండే రమారమీ 1600 మంది పిల్లలకు కావలసిన, పుస్తకాలు, పలకలు, బలపాలు, పెన్నులు వగైరా స్టేషనరీ సామగ్రి, యూనిఫారం, రింగ్ బాల్స్, స్కిప్పింగ్ రోల్స్, కేరంబోర్డులు వగైరా ఆటసామగ్రి అన్నింటికీ టెండర్ కాల్ ఫర్ చేసి, అతి తక్కువ ధరలకు ఎవరు కోట్ చేస్తే వారి దగ్గర నుంచి అన్నీ కొని పిల్లలకు ఉచితంగా పంచిపెట్టడం అనేది ఆ ప్రాజెక్టులో రెగ్యులర్ గా జరిగే పని అన్నమాట. ప్రాజెక్టు ఆఫీసు తిరుచానూరు రోడ్డులో ఉన్న అన్నగారి కాలంలో కట్టించిన మహిళా ప్రాంగణంలో ఉండేది. అమ్మగారేమో మునుపే చెప్పినట్లుగా చిత్తూరు డీసీఓ. కాబట్టి, ముందున్న పరిచయాలతో కాబోలు, ప్రతీ ఏటా చిత్తూరు పాత బస్టాండు దగ్గరలో ఉన్న కేవీఎస్ ప్రింటర్స్ వారికే ఈ మొత్తం ఆర్డర్ నిరాటంకంగా వెళ్ళిపోయేది. ఏది ? కేవలం వాళ్ళు ఆఫ్ సెట్ ప్రింటర్స్ అయినా కూడా పైన చెప్పిన అన్ని వస్తువులూ వారే సరఫరా చేసేట్టుగా ఒప్పందం జరిగిపోయేది. లోపాయికారీ అని అనలేను, ఎందుకంటే నా దగ్గర ఋజువులు లేవు కాబట్టి 😉

మరి ఆ సంవత్సరం మాత్రం మన ప్రతిభ మనం ప్రదర్శించాలి కాబట్టి, మేడమ్ గారిని అడిగితే, మీకు తెలుసా నాణ్యత, ధరల గురించీ, తక్కువకు తీసుకురాగలరా, పర్చేజ్ కమిటీ ఛైర్మన్ జాయింట్ కలెక్టర్ అక్కడ !!?? అని ఓఓఓ భయపెట్టడానికి ప్రయత్నం చేసీ కూడా, ఆఆఆ.. ఏం చేస్తాడులే కుర్రవాడు చూద్దాం ఏం తెస్తాడో అని నా ప్రతిపాదనకు సరే అన్నారు. శాంపుల్ గా ఆట సామగ్రి కోసం తిరుపతిలోనూ, యూనిఫారం కోసం చిత్తూరు దివ్య టెక్స్ టైల్స్ నుంచీనూ (మనకు గణేషన్న మంచి దోస్తు లెండి 😍) కొటేషన్లు తీసుకుని కథ మొదట్లో చెప్పిన పర్చేజ్ కమిటీ మీటింగ్ లో జాయింటు కలెక్టర్ వారి దివ్య సముఖమునకు సమర్పించితిని. అవి చూసిన జాయింట్ కలెక్టరు దిమ్మ తిరిగి మైండు బ్లాకయినది 😁. శ్రీమాన్ కేవీఎస్ ప్రింటర్ వారు కోట్ చేసిన యూనిఫారం మీటరు ధర రూ.85 ఐతే నేను ఇచ్చిన ధర రూ.35. వారు ఇచ్చిన రింగ్ బాల్ ధర రూ.35 ఐతే నేను ఇచ్చిన ధర రూ.15. అందునా కేవలం ధరలు మాత్రమే కాదు, ఆ ధరలతో పాటు జతపరచిన శాంపుల్స్ నాణ్యత చూసి జాయింట్ కలెక్టర్ గారు వాళ్ళవి విసిరేసినంత పని చేశారు..😂

కావున, పై సమావేశం అలా జరిగి, ఆ నిర్ణయం తీసుకుని నా మీద ఆ బాధ్యత వేయడంతో ఖంగుతిన్న ఆవిడ, కక్షకొద్దీ స్టేషనరీ మొత్తం ఆర్డర్ కూడా వాళ్ళకు ఇవ్వకుండా రద్దు చేసి, ఇవి కూడా మీరే తిరిగి తక్కువకు పట్టుకురండి అని పురమాయించింది. అదేదో నాకు శిక్షలాగా..😄 బ్యాక్ గ్రౌండ్ లో మళ్ళీ ఆ కేవీఎస్ వాళ్ళకు చీవాట్లేసి, అన్నీ వీలైనంత తగ్గించి కొటేషన్ తీసుకురండయ్యా అని చెప్పి పంపించింది కూడా. అదీగాక, ఆవిడకు నేను తెచ్చిన కొటేషన్లు చూడడం నామోషీ అనిపించి, జాయింట్ కలెక్టర్ గారు ఆవిడకు కట్టబెట్టిన విశేషాధికారం ఉపయోగించి, డిస్ట్రిక్ట్ కోపరేటివ్ ఆడిట్ ఆఫీసర్ గారైన శ్రీ సుబ్బారావు గారిని నా పైన అధికారిగా నియమిస్తూ నోట్ ఫైల్ లో వ్రాసి పడేసింది. నాన్నగారి ద్వారా ఆయన నాకు ముందే పరిచయం ఉన్నట్టు ఆవిడకు తెలియదు. అయినా పనిలో అవినీతి లేని మనకు ఎవరైతే ఏంటి చెప్పండి 😎 నేనేమో పరమానందంగా స్వీకరించి ఇంకో రెండు రోజులు తిరిగి అన్నీ పట్టుకొచ్చి ఆయనకివ్వడం, ఆయన శుభ్రంగా ఓకే చెప్పడం, ఆవిడ ఈగో శాటిస్ఫై చేయడానికి ఒకట్రెండు వస్తువులు ఈయన రిజెక్టు చేసినట్టు వ్రాసి, అవే వస్తువులు మళ్ళీ తెచ్చినట్టు చూపించి ఎలాగైతేనేం మొత్తానికి ఫైనలైజ్ చేసి జాయింట్ కలెక్టర్ గారిముందు పెట్టాం. టోకుమొత్తంగా రెండున్నర లక్షల రూపాయల వరకూ ఆదా చేసినట్టుగా పట్టిక తయారుచేసి (అప్పుడప్పుడే విండోస్98 లో నేర్చుకున్న ఎక్సెల్ లో😎) ఆయన ముందు పెడితే నా సామిరంగా ఆవిడ ముఖచిత్రం చూడాలీ....😂😂😂

మొత్తం అన్ని వస్తువులూ నేనే ప్రొక్యూర్ చేసి నేనే రిసీవ్ చేసుకుని అన్ని పాఠశాలలకూ సమన్యాయం పాటిస్తూ నేనే స్వయంగా అందించినప్పటి నా అనుభవం, అనుభూతి నేను ఇక్కడ ఇలా మాటల్లో వర్ణించలేను...

ఇంకా ఇంకా ఇలాంటి మరెన్నో ఉద్యోగానుభవాలతో మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తానని మాట ఇస్తూ...

మీ అందరి అభిమానపాత్రుడు
కందర్ప కృష్ణమోహన్ 

Sunday, 12 July 2020

కరోనా లాక్ డౌన్ తర్వాత...

కరోనా లాక్‌డౌన్ తర్వాత నా దినచర్య.

నాలాంటి ఎంతోమందికి ఈ విషయం వ్రాయడం వలన ఉపయోగం కలుగుతుందని ఆశించి వ్రాస్తున్నాను.
ఉదయం తొమ్మిది గంటలకల్లా కాలకృత్యాలు, నిత్యానుష్ఠానం అన్నీ అయిపోజేసుకుని ఆఫీసుకు బయలుదేరే క్రమంలో, కనీసం ఐదు సార్లు హ్యాండ్‌వాష్ వాడే అవసరం కలుగుతోంది. 1. లావెట్రీ తరువాత. 2. స్నానం తర్వాత మాయిశ్చరైజర్ రాసుకున్నాక. 3. మొత్తం తయారయి ఫలహారానికి కూర్చునే ముందు. 4. తినడం పూర్తి అయిన తర్వాత. 5. సాక్స్ వేసుకున్నాక.

తర్వాత, హెల్మెట్, లంచ్ బ్యాగ్ తీసుకుని ఆక్టివా దగ్గరకు చేరుకుని డిక్కీ తెరిచి ముందుగా మాస్క్ పెట్టుకుని హెల్మెట్ ధరిస్తాను. డిక్కీలోని బట్టతో బండిని శుభ్రం చేసుకుని బట్ట మళ్ళీ డిక్కీలో వేసుకుని బండి బైటకు తీసుకెళ్ళి స్టాండు వేసి, గేటు గడియ పెట్టాక, లాక్ వేయని డిక్కీలోంచి శానిటైజర్‌తో  రెండు చేతులూ బొటనవేళ్ళతో సహా శుభ్రం చేసుకుని, శానిటైజర్ డిక్కీలో వేసుకుని, బండిమీద కూర్చుని చేతి గ్లౌజెస్ వేసుకుని ఆఫీసుకు బయలుదేరి వెళ్తున్నాను.

దాదాపు పది కిలోమీటర్ల ప్రయాణంలో ట్రాఫిక్ లో తారసపడే అన్ని వాహనాలకూ, వ్యక్తులకూ నాకూ మధ్య కనీసం మూడు మీటర్ల దూరం ఉండేలా చూసుకుంటున్నాను. సిగ్నల్స్ దగ్గర దూరి దూరి ఘుసాయించి నిలబడను. రెండోసారి సిగ్నల్ పడినా ఫర్వాలేదని భావించి వీలైనంత దూరంగానే ఉండిపోతాను.

ఆఫీసుకు చేరుకున్నాక బండి పార్క్ చేసుకుని, మళ్ళీ డిక్కీలోని శానిటైజర్‌తో  రెండు చేతులూ బొటనవేళ్ళతో సహా శుభ్రం చేసుకుని, శానిటైజర్ డిక్కీలో వేసుకుని, హెల్మెట్ తీసి బయోమెట్రిక్ లో ముఖాన్ని మాత్రమే చూపించి (నేనే హెచ్చార్ మేనేజర్ కాబట్టి, వేలిముద్రల భాగాన్ని పూర్తిగా మూసివేశాను) మరలా వ్రాతపూర్వకంగా కూడా పెట్టుకున్న హాజరు కాగితాల్లో కేవలం నా పెన్నుతో మాత్రమే సంతకం చేసి, సెక్యూరిటీ సిబ్బంది నా శరీర ఉష్ణోగ్రతను ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్ ద్వారా చూసి రిజిస్టరులో నమోదు చేసుకున్నాక, నేను తెచ్చి పెంచుకుంటున్న మొక్కల పరిస్థితిని ఒకసారి తరచి చూసుకుని ఆఫీసులో అడుగు పెడుతున్నాను. నాసీటు దగ్గరకు వెళ్ళాక శావ్లాన్ క్రిమిసంహారక స్ప్రే (నా సొంత ఖర్చుతో మాత్రమే) వాడి, మొత్తం కంప్యూటర్లు, కీ బోర్డులు, మౌసులు, ప్రింటర్లు ఇంకా అటువంటి అన్ని వస్తువులనూ శుభ్రం చేసుకుని, నా అల్మైరాలో అక్కడే ఉంచుకున్న శానిటైజర్‌తో  రెండు చేతులూ బొటనవేళ్ళతో సహా మళ్ళీ శుభ్రం చేసుకుని అప్పుడు కుర్చీలో కూర్చుంటున్నాను. నేను ఆఫీసులో ఉన్నంతవరకూ, నా త్రాగే నీళ్ళ సీసా పక్కనే శానిటైజర్ కూడా తనకంటూ స్థలాన్ని తనే కేటాయించుకుని శాశ్వత నివాసం ఏర్పరచుకుంది.

ఆఫీసునంతటినీ చక్కగా శుభ్రంగా పెట్టుకునే మా కుమారి, ఒక అరగంట తర్వాత పసుపు కలిపిన పాలు నాకంటూ విడిగా పెట్టుకున్న కప్పులో తెచ్చి ఇస్తోంది. ఆఫీసు, ఆఫీసు మనుషుల శుభ్రత పట్ల ఆవిడ చూపించే శ్రద్ధకు నేను తన పట్ల సర్వదా కృతజ్ఞత కలిగి ప్రవర్తిస్తూ, ఇదిగో, ఈ లాక్‌డౌన్ తర్వాతనే, ఆవిడకు ఒక ఆరువందల రూపాయలు ఇంటెరిమ్ ఇంక్రిమెంటు కూడా మేనేజ్‌మెంటుతో మాట్లాడి వేయించాను. అందువల్ల ఆవిడకు కలిగే సంతోషం వల్ల మొత్తం ఆఫీసు మరింత శుభ్రంగా ఉండగలదని నా విశ్వాసం.

పనివేళల్లో, ఆ పనిలో భాగంగా ఆఫీసులో వేరే కాగితాలు ముట్టుకున్నా, డైరెక్టర్ల సంతకాల కోసం వారి క్యాబిన్లలోకి నేను వెళ్ళి వచ్చినా, వేరే సహాయకులను పంపించి తెప్పించుకున్నా, వేరే ఎవరి చేతుల మీదుగా ఏమి తీసుకున్నా ఆ పని అయిన తర్వాత శానిటైజర్‌తో  రెండు చేతులూ బొటనవేళ్ళతో సహా మళ్ళీ శుభ్రం చేసుకోవడం అలవాటు చేసేసుకున్నాను. మాస్కు ధరించడం అంటే ముక్కు క్రిందకు వేసుకోవడం, కేవలం గొంతుకు అలంకరించుకోవడం కాకుండా, ముక్కు పైనుంచి గొంతు భాగం వరకు పూర్తిగా కప్పి ఉంచే విధంగా మాత్రమే మాస్కును ధరిస్తున్నాను. ఎవరితో ఐనా సరే అవసరానికి మించి మాట్లాడడం లేదు. ఆఫీసు సమయం మొత్తం అరగంటకు ఒకసారి మాస్కు పూర్తిగా తీసి, నామమాత్రంగా చేతులు శానిటైజ్ చేసుకుని నీళ్ళు త్రాగుతున్నాను. ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం రెండు గంటల మధ్యలో కనీసం లీటరున్నర నీళ్ళు తాగుతున్నాను. అదే సమయంలో ఆరు బాదంపప్పులు కూడా నములుతున్నాను. భోజనానికి ముందు నేను విడిగా పెట్టుకున్న హ్యాండ్‌వాష్ కుమారి తీసి ఇస్తుంది. దానితో చేతులు శుభ్రం చేసుకున్నాక భోజనం చేస్తున్నాను. భోజన విరామంలో ఇదివరకు ఇంకో ఇద్దరు ముగ్గురితో కలిసి చేసే అలవాటును పూర్తిగా మానుకున్నాను. ఆలస్యమైనా సరే, మిగిలిన అందరి భోజనమూ అయిన తర్వాత, నేను ఒక్కణ్నీ మాత్రమే తింటున్నాను. తిన్నాక సీటు దగ్గరికి వచ్చి శానిటైజర్‌తో  రెండు చేతులూ బొటనవేళ్ళతో సహా మళ్ళీ శుభ్రం చేసుకుని కూర్చుంటున్నాను. సాయంత్రం టీ వచ్చినప్పుడు కూడా శానిటైజర్‌తో  రెండు చేతులూ బొటనవేళ్ళతో సహా మళ్ళీ శుభ్రం చేసుకుని, తర్వాత టీ తాగుతున్నాను. ఎప్పుడైనా మాస్క్ తీసేలోపలే తుమ్మూ దగ్గూ ఆపుకోలేక వస్తే, వెంటనే మాస్క్ మార్చేస్తున్నాను.

సాయంత్రం ఆఫీసు అయ్యాక బండి దగ్గరకు వచ్చి డిక్కీలోని శానిటైజర్‌తో  రెండు చేతులూ బొటనవేళ్ళతో సహా మళ్ళీ శుభ్రం చేసుకుని బయోమెట్రిక్ లో ముఖాన్ని మాత్రమే చూపించి మరలా వ్రాతపూర్వకంగా కూడా పెట్టుకున్న హాజరు కాగితాల్లో కేవలం నా పెన్నుతో మాత్రమే సంతకం చేసి, సెక్యూరిటీ నా శరీర ఉష్ణోగ్రతను ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్ ద్వారా చూసి రిజిస్టరులో నమోదు చేసుకున్నాక, బైటకు వచ్చి డిక్కీలోని శానిటైజర్‌తో  రెండు చేతులూ బొటనవేళ్ళతో సహా మళ్ళీ శుభ్రం చేసుకుని ఇంటికి బయలుదేరి వస్తున్నాను.

దారిలో ఇంటికి కావలసిన ఏ వస్తువులు కొనాలన్నా, పెట్రోలు బంకుల్లోనూ కూడా వీలైనంత వరకూ కరెన్సీ వాడడంలేదు. కేవలం ఫోన్ తో మాత్రమే చెల్లింపులు చేస్తున్నాను. ప్లాస్టిక్ కరెన్సీ కూడా అతి తక్కువగా వాడుతున్నాను. వారు ప్యాక్ చేసి ఇచ్చే ఏ వస్తువైనా గ్లౌజ్ తో మాత్రమే తీసుకుంటున్నాను. ఒకవేళ ఫోన్ చెల్లింపులు చేసే కారణాన చేతికి గ్లౌజు లేకుండా ఆ వస్తువులు తీసుకోవలసివస్తే, ఆ వస్తువులను నా దగ్గర ఎప్పుడూ స్పేర్‌గా ఉండే సంచీలో పెట్టుకున్నాక, డిక్కీలోని శానిటైజర్‌తో  రెండు చేతులూ బొటనవేళ్ళతో సహా మళ్ళీ శుభ్రం చేసుకుని, గ్లౌజులు వేసుకుని కానీ బండి స్టార్ట్ చేయను.
ఇక ఇంటికి చేరుకున్నాక, ఇంటిగేటు తీసుకుని బండి లోపల పెట్టి, ఇంటి గుమ్మం దగ్గరే ఉన్న గూట్లో హెల్మెట్ పెట్టి దానిమీద జనరల్ బజార్, సికింద్రాబాద్‌లో హోల్‌సేల్‌గా తెచ్చుకున్న క్రిమిసంహారక ద్రవాన్ని స్ప్రే చేస్తున్నాను. తర్వాత అదే గూట్లో ఉన్న శానిటైజర్‌తో  రెండు చేతులూ బొటనవేళ్ళతో సహా మళ్ళీ శుభ్రం చేసుకుని, నా లంచ్ బ్యాగు, మిగతా వస్తువులతో నేరుగా స్నానాల గది దగ్గరకు వెళ్ళిపోతాను. అక్కడ రెండు బకెట్లు తయారుగా ఉంటాయి. ఒక దాంట్లో లంచ్ బ్యాగులోని వస్తువులు వేసి క్రిమిసంహారక ద్రవాన్ని స్ప్రే చేస్తున్నాను. మిగతా జేబులోని వస్తువులూ, ఫోన్ పౌచ్, పర్సు, కళ్ళజోడు తదితర వస్తువులన్నీ కూడా క్రిమిసంహారక ద్రవంతో కానీ శానిటైజర్‌తో కానీ శుభ్రం చేసుకుని, ఇంకో బకెట్లో నా బట్టలన్నింటినీ స్నానాలగదిలో వేసి అప్పటికే ఇంకో బకెట్లో నింపి ఉంచిన వేడి వేడి నీళ్ళు ఆ బట్టలమీద శావ్లాన్ తో కలిపి పోసి బాగా జాడించి మూత పెట్టి, స్నానం చేసే వేడి నీళ్ళలో ఒక 15 మిలీ పరిమాణంలో పసుపు వేసుకుని తలారా, నీళ్ళకు కరువు చేయకుండా స్నానం చేసి, ఆ తర్వాత ఆ బట్టలను మరలా జాడించి పిండి, బైట పెట్టుకుని, తయారయి కుర్చీలో కూర్చుని ఒక లీటర్ చల్లటి మంచినీళ్ళు కడుపునిండా తాగి, ఆ తర్వాత ఆ బట్టలు డాబాపైకి తీసుకెళ్ళి ఆరేసి కిందకు వచ్చి మరలా హ్యాండ్‌వాష్‌తో చేతులు బొటనవేళ్ళతో సహా బాగా శుభ్రం చేసుకుని అప్పుడు కుర్చీలో కూర్చున్నాక.....

మళ్ళీ ఊపిరి తీసుకోవడం ప్రారంభిస్తున్నాను..

ఫోన్ పట్టుకుని కూర్చున్నప్పుడు భార్యాబిడ్డలు ఏవి పెడితే అవి తిని, ఆ తర్వాత డిన్నర్ చేసేముందు మళ్ళీ హ్యాండ్‌వాష్‌తో చేతులు బొటనవేళ్ళతో సహా బాగా శుభ్రం చేసుకుని, ఆ తర్వాత డిన్నర్ చేస్తున్నాను. డిన్నర్ అయిన తర్వాత మళ్ళీ హ్యాండ్‌వాష్‌తో చేతులు బొటనవేళ్ళతో సహా బాగా శుభ్రం చేసుకుంటున్నాను.
రోజు మొత్తంలో ఎన్నిసార్లు వాష్‌రూమ్ కి వెళ్ళివచ్చినా సరే హ్యాండ్‌వాష్‌తో చేతులు బొటనవేళ్ళతో సహా బాగా శుభ్రం చేసుకుంటూనే ఉంటాను.

మిగతా రోజుల్లో కూడా, ఎక్కడ ఏమి కొనవలసి వచ్చినా కూడా, కొత్త కొత్త ప్రదేశాలకూ, అంగళ్ళకూ వెళ్ళకుండా, షాపింగ్ మాళ్ళకూ సూపర్ మార్కెట్లకూ ఎక్కువగా వెళ్ళకుండా, తక్కువ జనాలు వెళ్ళే అంగళ్ళకు మాత్రమే వెళ్తున్నాను. మాటిమాటికీ అంగళ్ళు మార్చను. కూరగాయలు కూడా రెగ్యులర్ గా ఒకేచోట అన్నీ ఒకేచోట దొరికి, శుభ్రంగా పెట్టి అమ్మే బండి వెతుక్కుని మరీ అక్కడ మాత్రమే కొంటున్నాను.

అదీ విషయం. ఎక్కడా ఒక్కసారి కూడా అజాగ్రత్తగా ఉండకండి. నయమయ్యేదే అనే ధైర్యం అవసరమే అయినా, ఆ ట్రౌమా భరించడం కంటే ముందుగానే అతి అనిపించినా సరే, ఇన్ని జాగ్రత్తలూ తీసుకోవడమే సుఖం.

మిత్రులందరి క్షేమం కోరుకుంటూ, జాగ్రత్త చెబుతూ సెలవు.
ధన్యవాదాలు 🙏🙏.

Monday, 4 May 2020

లాక్ డౌన్ - జిందాబాద్

నలభై మూడు రోజుల తర్వాత ఈరోజు ఆఫీసుకు వెళ్ళాను.

నా 29 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఇన్ని రోజులు ఎప్పుడూ ఇంట్లో లేను. కాబట్టి ఇది కచ్చితంగా ఒక కొత్తదైన అనుభవమే.

కరోనా వైరస్ మనిషిలో ఏమీ చెప్పుకోదగ్గ మార్పు తేలేదని ఈరోజు మద్యం అమ్మకాల దగ్గర వాడి ప్రవర్తన బట్టి తెలిసిపోయింది. మనిషి తనను తాను చాలా గొప్పవాణ్ణి అని అనుకుంటూ ఎల్లకాలం గొప్పలు పోతూనే ఉంటాడు. ప్రకృతి మాత్రం చూసి చూసి వాడికి తట్లు తేలేలా గరిటె కాల్చి వాతలు పెడుతూనే ఉంటుంది. అయినా వాడికి మాత్రం సిగ్గు లేదు, రాదు.

ఉదయమూ సాయంత్రమూ కూడా మామూలు రోజుల్లోని రద్దీలో 10-15 శాతం మాత్రమే రోడ్ల మీద కనిపించారు. నాలుగు చెక్ పోస్టుల్లో రెండు చోట్ల మాత్రం కొంచెం ఆపి తనిఖీలు చేస్తున్నారు. అది కూడా, ఒక్కడూ వెళ్ళే ఏ బండినీ కూడా ఆపడం లేదు. కేవలం డబుల్స్ వెళ్ళేవాళ్ళను మాత్రమే ఆపి పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాసులు తీసుకుంటున్నారు.

ఉదయం వెళ్ళేటప్పుడు అదొక రకమైన గిలితో వెళ్ళాను కాబట్టి చుట్టుపక్కల పెద్దగా గమనించుకోలేదు కానీ, సాయంత్రం వచ్చేటప్పుడు మాత్రం ప్రశాంతంగా మొత్తం 9 కిలోమీటర్ల దూరమూ రోడ్డుకు ఇరువైపులా, ఎదురుగా అంతా, అన్నింటినీ నిదానంగా గమనించుకుంటూ వచ్చాను. ఆ క్రమంలో నాకు ప్రకృతి పైన ప్రేమ, గౌరవం రెండూ కొన్ని వందల రెట్లు ఇనుమడించగా, మనిషి మీద, మనిషి ప్రవర్తన మీద, వాడి అహంకారం మీద అంతకు రెట్టింపుగా అసహ్యం పెరిగింది. విషయం ఏమిటంటే, దాదాపు 7 కిలోమీటర్ల పొడవునా రోడ్డు డివైడర్ల మధ్యలోనూ, మెట్రో స్తంభాల మధ్యలోనూ ఉన్న రకరకాల మొక్కలు, చెట్లు, మరెన్నో రంగురంగుల పూలు కనువిందు చేశాయి. అందులో గొప్పేముందీ అంటారేమో, వస్తున్నా, అక్కడికే వస్తున్నా..😃😃 మొత్తం అన్ని మొక్కలు, చెట్లు, పూలు వేటిమీదా కూడా ఇసుమంత దుమ్ము లేదు, పొగచూరిన మరకలు లేవు. తళతళలాడుతూ గర్వంగా, ఆకుపచ్చగా మెరిసిపోవడమే కాక చాలాచోట్ల డివైడర్లను దాటి రోడ్లమీదకు పాకాయి. వాటి ఆనందం మీరు అనుభవించి చూడాల్సిందే. అవన్నీ కూడా కరోనాకు హృదయపూర్వక ధన్యవాదాలు అర్పించుకుంటూ ఆనందిస్తున్న అనుభూతి నాకైతే కలిగిందబ్బా...😍

ఒరే మనిషీ !?!?!
ఎందుకురా నీకు అంత పొగరు, మదం, అహంకారం ?? ఏం చూసుకుని ??
ఇప్పుడు చూడు నీ బతుకు ఎలా అయిందో 😏😏 బైటికి రావాలంటే ముక్కూ నోరూ ముఖమూ చేతులూ కాళ్ళూ అన్నీ మూసుకుని రా. బాగుందారా ఇప్పుడు ? తిక్క బాగా కుదిరిందా ఇప్పుడు ?

అని అవన్నీ నన్ను చూసీ చూడనట్లుగా మొహం తిప్పుకున్నట్టూ, వెటకారంగా మాటాడుకున్నట్టూ ఏదో వింత భావన..

నా దృష్టిలో, కనీసం సంవత్సరానికి రెండుసార్లు కనీసం పదిహేను రోజుల చొప్పున తప్పనిసరి లాక్ డౌన్ అమలుపరచాలి. అది మనిషి ఆత్రపు తిండిపోతుతనానికి ఆరోగ్యకరమైన ఉపవాసం లాగా, మనకూ ప్రకృతికీ కూడా చాలా మేలు చేస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

మనిషి మంచిగా మారినా మారకపోయినా, వాణ్ణి బలవంతంగా ఇంట్లో కూర్చోబెట్టి ప్రకృతికి దాని పవిత్రతనూ, సౌందర్యాన్నీ తిరిగి తెచ్చిన...

లాక్ డౌన్ - జిందాబాద్.. 🙏🙏🙏

Wednesday, 15 April 2020

నా పెళ్ళి - నా జీవితం.

పెళ్ళి.

"ఆరోజు అలా చేసి ఉంటే...ఈరోజు ఇలా ఉండేది కాదు, అని మీరు అనుకునే సంఘటన ఏంటి?"
పొద్దున్న ట్విట్టర్లో వచ్చిన పై ప్రస్తావనకు నా సమాధానం నా పెళ్ళి అని ఇచ్చాను.

దానికి వివరణ అని కాదు కానీ, కొన్ని భావాలు, అనుభవాలు పంచుకోవడానికే ఈరోజు ఈ రాత.

చిన్నప్పట్నుంచీ కూడా పెళ్ళి అంటే సదభిప్రాయం లేని మాట వాస్తవం. దానికి తోడు, ఇంట్లో దైవభక్తి, అందుకు సంబంధించిన ఆచార వ్యవహారాలు ఎక్కువగా ఉండడం చేత అసలు పెళ్ళి కంటే దైవభక్తి మార్గమే చాలా గొప్పదీ, ఉపయోగమైనదీ, మానవ జన్మను సార్థకపరచేదీ అని ఇలా రకరకాల అభిప్రాయాలు కలగడమూ, కొండొకచో, కొన్నింటిని కొంతమంది బుర్రలోకి జొప్పించడం కూడా జరిగింది.

పెళ్ళి అంటే కేవలం పిల్లలూ, సంసారం, బరువూ, బాధ్యతా తప్పించి అందులో మరే ఇతర ఉపయోగమూ లేదని బాగా గట్టిగా అల్ట్రాటెక్ సిమెంటు ముద్రలు బుర్రలో బాగానే పడ్డాయి. పైగా, అటువంటి అభిప్రాయాలకు బలం చేకూరుస్తూ పద్ధెనిమిదో యేటనుంచే ఉద్యోగం చేయవలసి రావడం, కుటుంబ భారం కాస్తంత నెత్తిన పడడం లాంటివి కూడా జరిగాయి. అందువల్ల పెళ్ళి ప్రసక్తి తెచ్చినపుడల్లా అమ్మ మీద కోపం తెచ్చుకునేవాణ్ణి.

కానీ, "ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలిరా" - "నాకు ఓపిక ఐపోతోంది నేను పూర్తిగా మూల పడితే నువ్వు ఇబ్బంది పడతావురా" ఇవి మా అమ్మ రికార్డులు అరిగిపోయేదాకా వాడగా వాడగా, నిజంగా ఒకానొక సమయంలో ఆవిడ అనారోగ్యం చూసి, ఓహో, తల్లిదండ్రులు పెద్దవాళ్ళవుతూ ఉన్న సమయంలో నేను ఉద్యోగానికి వెళ్ళిపోతే వారికి సహకరించడానికైనా ఇంకొక మనిషిని నేను నమ్మి నా జీవితంలోకి తెచ్చుకోవాలని నాకు కలిగిన ఆలోచన ద్వారా, నేను పెళ్ళికి ఒప్పుకోవలసి వచ్చింది.

నిజానికి నా ప్రణాళిక ఏమిటంటే, ఉద్యోగం చేసుకుంటూనే దేశం మొత్తం తిరగాలనీ, అందులోని సర్వ జీవరాశులనూ పరికించి, పరిశీలించి, పరిశోధించి అర్థం చేసుకుని, మిగతా ప్రజలందరికీ నన్ను నేను ఉపయోగించే అవకాశాలు వెతుక్కుంటూ, పనిలో పనిగా దేశంలో ఉన్న అన్ని క్షేత్రాలూ, చారిత్రక ప్రదేశాలూ కూడా చూసేసి సంతృప్తి చెందిన పిమ్మట, చివరగా అంత్యకాలంలో, శేషజీవితాన్ని అరుణాచలంలో గడిపివేయాలని నేను నా ఇరవై రెండవ యేట 1995లో నిర్ణయించుకున్నాను.

అయితే, ఆ నిర్ణయం తీసుకునే సమయానికి, పెళ్ళి అనే విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలే కాక ప్రేమలు, త్యాగాలు కూడా ఉంటాయనీ, పిల్లలు అనే రత్నాలు, మోయగలిగే బరువునే కాకుండా మరువలేనంత ప్రేమను కూడా ఇస్తారనీ, టోకు మొత్తంగా చేదు గుళికలే కాక చాలా తీపి జ్ఞాపకాలు కూడా ఉంటాయనీ తెలియదు (మేం ముగ్గురు పిల్లలమూ మా తల్లిదండ్రుల పట్ల అలానే ఉన్నా కూడా, స్వీయానుభవమే గురువు కాబట్టి). తెలిపేందుకు ఇంట్లో ఆ వాతావరణమూ లేదు.

తర్వాత, పైన చెప్పుకున్న విధంగా పెళ్ళి అయిపోయిన తర్వాత, ఏమేమి ఉంటాయని తెలియదో అవన్నీ ఉంటాయని అర్థమైన తర్వాత, పెళ్ళి కూడా అవసరమేనూ, మనిషి జీవితంలో లెక్కించదగ్గ అనుభవమే అని అర్థమైంది. పెళ్ళి కాకుండా ఉండి ఉంటే, నేను అనుకున్న ప్రకారమే నా జీవితం ఉండేదో లేదో తెలియదు కానీ, పెళ్ళి అయిన తర్వాత కూడా అప్పటి లక్ష్యాలను కొద్దిగా అటూ ఇటుగా సాధించుకోవచ్చని మాత్రం స్పష్టంగా అర్థమైంది.

నా తమ్ముడు ఆదిత్య ఇంగ్లీష్ లో వ్రాసిన Struggle for Acceptance అనే బ్లాగుపోస్టు కూడా  https://twitter.com/vizagobelix/status/1250325190493368321?s=09  ఈరోజే రావడం కేవలం యాదృచ్ఛికమే అయినా కూడా చాలా సమయానుకూలంగా వచ్చిందని సంతోషిస్తూ, జీవితంలో ఎలా వచ్చినదాన్ని అలా అనుభవిస్తూ అనుభూతి చెందడంలోని సంతృప్తిని సంతృప్తిగా స్వీకరిస్తూ..

ఈరోజు ఈ బ్లాగుపోస్టు వ్రాసేటందుకు కారణమైన  https://twitter.com/avasaramledu/status/1249898596712845312?s=09   ఈ ప్రశ్న అడిగినవారికి కృతజ్ఞతలతో..

మీ కందర్ప కృష్ణ మోహన్.

Sunday, 8 December 2019

పొదుపు - మీ జీవితపు మలుపు

చాలామంది దృష్టిలో పొదుపు అంటే ఒక ఆపత్కాల నిధి మాత్రమే. కానీ నా స్వీయానుభవంలో నేను తెలుసుకున్నది, పొదుపు అంటే కేవలం ఆపత్కాల నిధి మాత్రమే కాదు. పొదుపు అంటే, ఒక కుటుంబ భవిష్యత్తు. పొదుపు అంటే కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు. ఒక వ్యక్తి సంపాదన అంటే, చాలా తక్కువ జీవితాల్లో తప్పితే మిగతా అందరికీ కూడా అది మొత్తం కుటుంబానికే ఆధారం.

అటువంటి సంపాదనతో ఒక కుటుంబాన్ని బతికించే బాధ్యత కలిగిన వ్యక్తి, కేవలం సంపాదన మీద మాత్రమే దృష్టి పెడితే సరిపోదు. ఆ వ్యక్తి నిజంగా తన బాధ్యతను సంపూర్ణస్థాయిలో నెరవేర్చాలి అంటే, తన జీవితకాలం మీద, తన జీవితకాలంలో తన ఆరోగ్యస్థితిమీద, తన జీవితకాలపు సంపాదన మీద, తన జీవితకాలపు సంపాదనమీద ఆధారపడిన ప్రతీ కుటుంబసభ్యుని ఆరోగ్యస్థితి మీద, అవసరాలమీద తనకు సంపూర్ణమైన అవగాహన ఉండి తీరాలి. అలాంటి అవగాహన ఉన్నప్పుడు, ఆ వ్యక్తి తన సంపాదనను సరైన దామాషాలో విభజించుకుని, ఆదాయానికి తగిన ఖర్చులకు సరిపడా పక్కకు తీసుకుని మిగతా మొత్తాన్ని భవిష్యత్ కోసం దాచడాన్నే పొదుపు అనుకోవచ్చు. ఇంతకు మునుపే తాతలు తండ్రుల ద్వారా సంక్రమించిన ఆస్తిని మరింత జాగ్రత్తపడి పెంచుకోవడం కూడా పొదుపు లాగానే పరిగణించవచ్చు.

కానీ, మానసిక సంతృప్తికీ, భావోద్వేగాలకూ ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే భారతదేశంలాంటి దేశంలో ఈ పొదుపుకు మనం ఇచ్చే ప్రాధాన్యత నూటికి పదిశాతం కూడా ఉండదని, లేదని కుండలు బద్దలుకొట్టి (అవి పొదుపు చేసుకుని ఉంటే) చెప్పవచ్చు. కానీ మారుతున్న సామాజిక, ఆర్థిక, భౌగోళిక, మానసిక, శారీరక పరిస్థితుల దృష్ట్యా సగటు భారతీయ పౌరుడు తన ఆలోచనావిధానాన్ని మార్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా, వ్యక్తి తన ప్రస్తుత అవసరాలు తీరడానికి, భవిష్యత్ కోరికలు తీర్చుకోడానికి కూడా తగినంతగా సంపాదించే నైపుణ్యాన్ని కలిగి ఉండడమే కాక, అటువంటి సంపాదనను కనీసం రెండు సంవత్సరాల అవసరాలకు సరిపడా నగదును ఎప్పుడూ కలిగి ఉంటేనే ఆ వ్యక్తి పొదుపు చేయడంలో సఫలమైనట్లు నా వ్యక్తిగత అభిప్రాయం.

ఇది పొదుపుపైన నా స్థూలమైన అంచనా.

ఇక నీతులు చెప్పడం అయిపోయింది కాబట్టి నా విషయానికొస్తాను.

మా ముత్తాతలు మండపేటలో కొన్ని వందల ఎకరాలకు జమీందార్లు. తాతగార్ల కాలానికొచ్చేటప్పటికి వారు సరైన జాగ్రత్త పడకపోవడంవలన, కుటుంబంమీద కంటే వ్యక్తిగత విలాసాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినమీదట ఆ ఎకరాలు కాస్తా హరించుకుపోయాయి. ఇంత జరిగాక కూడా నా తండ్రి తరంవాళ్ళు కూడా ఎటువంటి జాగ్రత్తా పడలేదు సరికదా నా తరానికి అప్పులు మిగిల్చారు. నేను ఈ విషయాన్ని వారిమీద నింద మోపడానికో నా అజాగ్రత్తను కప్పిపుచ్చుకోవడానికో చెప్పడంలేదు. వాస్తవాన్ని నిర్భయంగా ఒప్పుకోగలిగిన సత్తాతో చెప్తున్నాను. నా తాతల తండ్రుల తరానికీ, నాకూ కనీసం ఆ తేడా అయినా ఉందని నేను అనుకుంటాను.

కానీ, ఇంత విశ్లేషణ చేయగలిగీ, ఇంతగా మంచీ చెడూ తెలిసీ కూడా, నేను కూడా పొదుపు విషయంలో ఎటువంటి జాగ్రత్తా పడలేదు అని చెప్పడానికి సిగ్గు పడుతున్నాను. (అని చెప్పుకోడానికి సిగ్గు పడడంలేదు)

నేను 1991లో పని చేయడం మొదలెట్టినప్పట్నుంచీ ఇప్పటివరకూ దాదాపు 85 లక్షలు సంపాదించినట్టు ఈమధ్య నేను వేసుకున్న లెక్కలో తేలింది. అయితే నేను మొన్న ఒక ట్వీట్‌లో చెప్పినట్టుగా 30 శాతం పొదుపు అంటే కనీసం 25 లక్షలైనా పొదుపు చేసి ఉండాలి లేదా అందుకు సమానమైన స్థిరాస్తినైనా సమకూర్చుకుని ఉండాలి. ఏదీ జరగలేదు. 0.01 శాతం కూడా జరగలేదు.

అలాగే, ఇంకా విషాదకరమైన విషయమేమిటంటే, నాకు ఈ విశ్లేషణ, జ్ఞానం ఇప్పుడే కొత్తగా అలవడినవి కావు. మా నాన్నగారి ప్రతీ తప్పటడుగూ చూసినప్పుడల్లా నేర్చుకున్నాను. నా రెండవ తరగతి నుంచి నా పెళ్ళివరకూ కూడా ప్రతీ పైసనీ తన పరిధిలో తను పొదుపు చేసి, దాచి మా కనీస అవసరాలకు లోటు రాకుండా చూసిన మా అమ్మగారి కష్టాన్ని చూసిన ప్రతీ క్షణమూ నేర్చుకున్నాను. నాకు బుద్ధెరిగి, 1980లో పరిచయమైనప్పటినుంచీ దాదాపు డెబ్భై ఏళ్ళవయసులో, 2001 లో కీర్తిశేషులైన మా తాతగారు (అమ్మ నాన్నగారు) తన చివరిరోజు ఏలూరులో ఎక్కిన రిక్షా ఖర్చు 5/- కూడా పద్దు వ్రాసుకున్న క్షణం వరకూ కూడా నేర్చుకున్నాను. అయినా సరే నాకు అర్థమైన, నాకు తెలిసిన జాగ్రత్తలు కూడా నేను తీసుకోలేదు. ఫలితం – ఈరోజు పొదుపు చేసి దాచుకున్న ఎటువంటి మొత్తమూ లేదు. చాలాసార్లు నెలవారీ ఆర్డీ ఖాతాలు కూడా తెరవడం, 6-7 నెలల్లోపే మూసేయడం కూడా జరిగింది. 10-15 సంవత్సరాలు క్రమం తప్పక కట్టుకున్న బీమా పాలసీల మొత్తం కూడా ఒకానొక కష్టసమయంలో, ఎవరినుంచీ ఎటువంటి సహాయమూ అందని కొన్ని క్లిష్టపరిస్థితుల్లో హరించుకుపోయింది.

ఇందుకు కారణాలు నేను ఈవిధంగా విశ్లేషించుకున్నాను.

1. కనీసం డిగ్రీవరకూ కూడా చదువు చెప్పించకపోగా, నా సోదరి వివాహం, నా వివాహం ఖర్చులు కూడా నాపైనే తోసేసిన నా తండ్రి అసమర్థ ఆర్థిక నిర్వహణ. (క్షమించాలి, నా తండ్రిమీద నాకు ఎటువంటి ఫిర్యాదులూ లేవు, కోపమూ, ద్వేషమూ అసలే లేవు. కూసింత జాలి తప్ప)

2. ఇంత విశ్లేషణా జ్ఞానం ఉండీ కూడా నా సంపాదన మీద, నా అవసరాల మీద, నా భవిష్యత్ మీద నేను సరైన అవగాహన పెంచుకోకుండా, నా సంపాదనలో చాలాభాగం, నా మానసిక సంతృప్తి కోసం, భావోద్వేగాల కోసం, ఇంకా కొన్ని దుబారా విషయాలకు మాత్రమే ఖర్చు పెట్టేయడం.

కాబట్టి మిత్రులారా, ఇంకా బాధ్యతతో కూడిన జీవితం మొదలుపెట్టని యువకుల్లారా, కచ్చితంగా పొదుపు చేయండి. అదికూడా మీ మీ సంపాదనలో 30 శాతం నిర్దాక్షిణ్యంగా పొదుపు చేయండి. అది మీకు, మీ కుటుంబసభ్యులకి పిసినారితనంగా కనిపించినా సరే మానకండి. పై విషయాలు మీరంతా నామీద జాలిపడడానికో, సానుభూతి చూపించడానికో, నేను మంచి అనిపించుకోవడానికో, ప్రదర్శన కోసమో చెప్పడం లేదు. నన్ను నమ్మండి. కేవలం, కేవలమంటే కేవలం, కనీసం నాకు పరిచయం ఉన్న నా తర్వాతి తరమైనా జాగ్రత్తపడి, వారైనా సుఖపడాలని చెప్తున్నాను. అంతే తప్ప ఇందులో ఎటువంటి స్వార్థానికీ, నా పెద్దల పట్ల ద్వేషానికీ, నా జీవితం పట్ల నాకు అసంతృప్తికి గానీ అస్సలు తావు లేదు.

కొంచెం బాధాకరమైనా సరే, నా మనసులోని మాటలు తన ప్రశ్న ద్వారా బైటకు చెప్పించి మంచికి సహాయపడిన ట్విట్టర్ మిత్రుడు దేవీప్రసాద్‌కీ, ఈ విషయాల్లో ఇంతకుమునుపే మంచిమంచి మాటలు తన బ్లాగులో మనతో పంచుకున్న నా తమ్ముడివరస తమ్ముడు ప్రియమైన ఆదిత్యకీ, తెలుగు బ్లాగు దినోత్సవం (డిసెంబర్ రెండవ ఆదివారం) సందర్భంగా ఈ విషయాన్ని బ్లాగులో పంచుకోవాలనే ప్రేరణ కలిగించిన ప్రియమిత్రుడు, తెలుగోద్ధారకుడు వీవెన్ గారికి నా మనఃపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నా ఈ పోస్టు ఎవరినైనా తెలిసో తెలియకో నొప్పించి ఉంటే వారికి క్షమాపణలు తెలుపుకుంటూ, సెలవు. 🙏

ఒక ఉద్యోగానుభవం.....

  సమావేశ మందిరంలో కొన్ని సెకండ్లు శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. జాయింట్ కలెక్టర్ శ్రీ బి.వెంకటేశం గారు అందుకుని, మేడమ్, ఈ విషయం పూర్తిగా కృష్...